Anil Ambani : అనిల్ అంబానీ వ్యాపారపరంగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఆయనకు చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లోన్లను బాగా తగ్గించుకుంది. ఆ కంపెనీపై ఉన్న లోన్లు రూ.3,831 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గాయి. దీంతో ఇవాళ స్టాక్ మార్కెట్‌లో ఆ కంపెనీ షేర్లు రాణించాయి. బీఎస్‌ఈలో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ షేరు ధర 7శాతం పెరిగి రూ.252.15కు చేరింది. ఈ కంపెనీ నికర విలువ రూ.9,041 కోట్లకు చేరింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎడెల్‌వీస్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌తో పాటు ఇతర రుణదాతలు తమ అప్పులను క్లియర్ చేశాయని రిలయన్స్ ఇన్‌ఫ్రా(Anil Ambani) వెల్లడించింది. ఆ కంపెనీ లోన్స్ 87శాతం తగ్గడాన్ని మార్కెట్ వర్గాలు సానుకూల పరిణామంగా అభివర్ణిస్తున్నాయి.
రిలయన్స్ పవర్ షేరు కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో మంచి రేంజులోనే కదలాడుతోంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేర్లు బుధవారం(సెప్టెంబర్ 18న) రోజు 5 శాతం మేర పెరిగి రూ.32.98కి చేరాయి. విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ (VIPL) లేదా పవర్ జనరేషన్ కంపెనీకి గ్యారెంటర్‌గా తన ఆర్థిక బాధ్యతను పూర్తిగా నిర్వర్తించినట్లు సెప్టెంబర్ 17న రిలయన్స్ పవర్ ప్రకటించింది. రిలయన్స్ పవర్‌కు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఎలాంటి అప్పులు లేవని వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 30 వరకు మొత్తం ప్రాతిపదికన కంపెనీ నికర విలువ రూ.11,155 కోట్లు అని కంపెనీ పేర్కొంది. విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ తన అనుబంధ సంస్థ కాదని, రిలయన్స్ పవర్ స్పష్టం చేసింది. గత నాలుగున్నరేళ్లలో రిలయన్స్ పవర్ షేర్లు 2818 శాతం పెరిగాయి. అనిల్ అంబానీ కంపెనీ షేర్ ధర 2020 మార్చి 27న రూ.1.13. తాజాగా ఇవాళ దాని రేటు రూ.32.98కి చేరుకుంది. అంటే నాలుగున్నరేళ్లలోనే దీని రేటు 2800 శాతానికిపైగా పెరిగింది.