Hindenburg Research : అదానీ గ్రూప్‌నకు విదేశాల నుంచి నిధులను సమకూరుస్తున్న పలు డొల్ల కంపెనీల్లో భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఛైర్‌పర్సన్ మాధవీ పూరీ బుచ్, ఆమె భర్త ధావల్ బుచ్‌లకు వాటాలు ఉన్నాయంటూ ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ ఒక నివేదికను విడుదల చేసింది. ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ కంపెనీ. ‘సమ్‌థింగ్ బింగ్ సూన్ ఇండియా’ అని శనివారం ఉదయం ట్వీట్ చేసిన ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’.. శనివారం రాత్రికల్లా అదానీ గ్రూపుతో మాధవీ పూరీ బుచ్ దంపతులకు ఉన్న సంబంధంపై వివరాలతో రిపోర్టును రిలీజ్ చేసి సంచలనం క్రియేట్ చేసింది. ఈనేపథ్యంలో సెబీ ఛైర్‌పర్సన్ మాధవీ పూరీ బుచ్ దంపతులు వెంటనే ఆగస్టు 11న అర్ధరాత్రి తర్వాత 1:40 గంటలకు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.
We’re now on WhatsApp. Click to Join
తమపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్(Hindenburg Research) చేసిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. ఆ నివేదికలో తమపై చేసినవన్నీ నిరాధార ఆరోపణలే అని మాధవీ పూరీ బుచ్ దంపతులు స్పష్టం చేశారు. ఆ నివేదికలో ఎంతమాత్రమూ సత్యం లేదని తేల్చి చెప్పారు. తమ జీవితం, ఆర్థిక వ్యవహారాలు తెరిచిన పుస్తకం లాంటివన్నారు. తమ ఆర్థిక స్థితిగతులు, ఆదాయాలతో ముడిపడిన స్పష్టమైన వివరాలు సెబీ వద్ద ఉన్నాయని మాధవీ పూరీ బుచ్ దంపతులు చెప్పారు. సెబీ అత్యున్నత పదవిలోకి రాకముందు తమ కుటుంబంతో ముడిపడిన ఆర్థిక పత్రాలను బహిర్గతం చేయడానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని మాధవీ పూరీ బుచ్ స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు ఆ సమాచారాన్ని కోరితే తప్పకుండా అందిస్తామని చెప్పారు. ఈ అంశంపై పూర్తి పారదర్శకత కోసం.. తాము తగిన సమయంలో వివరణాత్మక ప్రకటనను జారీ చేస్తామని మాధవీ పూరీ బుచ్ దంపతులు తెలిపారు. ‘‘భారత కంపెనీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు మేం ఇటీవలే హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కు షోకాజ్ నోటీసును జారీ చేశాం. అందుకు ప్రతిగా మాపై ఈవిధమైన దుష్ప్రచారానికి ఆ సంస్థ తెగబడింది’’ అని మాధవీ పూరీ బుచ్ ఆరోపించారు.
Also Read :Drugs On Dark Web : డార్క్ వెబ్‌లో డ్రగ్స్.. స్పీడ్ పోస్టులో డెలివరీ.. గుట్టురట్టు
బెర్ముడా, మారిషస్ దేశాల నుంచి అదానీ గ్రూపునకు నిధులను సమకూరుస్తున్న డొల్ల కంపెనీలలో మాధవీ పూరీ బుచ్, ధావల్ బుచ్‌లకు రహస్య వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ నివేదిక పేర్కొంది. ఆ రెండు దేశాలలోని డొల్ల కంపెనీలను గౌతమ్ అదానీ అన్నయ్య వినోద్ అదానీ కంట్రోల్ చేస్తున్నారని ఆరోపించింది.