Site icon HashtagU Telugu

Patanjali Products : బాబా రాందేవ్‌కు షాక్.. 14 పతంజలి ప్రోడక్ట్స్ లైసెన్సులు రద్దు

Patanjali Foods

Patanjali Foods

Patanjali Products : యోగా గురువు బాబా రాందేవ్ కంపెనీ ‘పతంజలి’కి  మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీకి చెందిన 14 ఉత్పత్తులను బీజేపీ పాలిత  ఉత్తరాఖండ్ రాష్ట్ర సర్కారు సస్పెండ్ చేసింది. ఈవిషయాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం లిఖితపూర్వకంగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఉత్తరాఖండ్ స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మిథిలేశ్ కుమార్ ఈమేరకు సుప్రీంకోర్టు ధర్మాసనానికి  అఫిడ్‌విట్‌ను సమర్పించారు. తాము లైసెన్సులు రద్దు చేసిన పతంజలి ప్రోడక్ట్స్ జాబితాలో.. పతంజలి ఆయుర్వేద దివ్య ఫార్మసీ రూపొందించిన దృష్టి ఐ డ్రాప్, స్వసరి గోల్డ్, స్వసరి వాటి, బ్రొన్‌కమ్, స్వసరి ప్రవాహి, స్వసరి అవాలెహ్, ముక్తా వాటి ఎక్స్‌ట్రా పవర్, లిపిడామ్, బీపీ గ్రిట్, మధుగ్రిట్, మధునషిని వాటి ఎక్స్ ట్రా పవర్, లివమ్రిత్ అడ్వాన్స్, లివొగ్రిట్, ఐగ్రిట్ గోల్డ్ ఉన్నాయని వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join

ప్రజలను తప్పుదోవ పట్టించేలా 14 పతంజలి ఉత్పత్తుల గురించి పత్రికా ప్రకటనలు ఇవ్వడం సరికాదని ఏప్రిల్ 15న దివ్య ఫార్మసీ పతంజలి ఆయుర్వేద సంస్థకు ఉత్తర్వులు జారీ చేశామని సుప్రీంకోర్టుకు ఉత్తరాఖండ్ స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ తెలిపింది. పదేపదే నిబంధనలను ఉల్లంఘిస్తున్నందుకు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1945లోని 159 (1) నిబంధన కింద పతంజలికి చెందిన 14 ఉత్పత్తులకు(Patanjali Products) లైసెన్సులను రద్దు చేశామని పేర్కొంది. ఏప్రిల్ 16న హరిద్వార్ జిల్లా ఆయుర్వేదిక్ అండ్ యునాని అధికారి.. రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీ, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌లపై సెక్షన్ 3 కింద చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసినట్టు కోర్టుకు ఉత్తరాఖండ్ స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ చెప్పింది.

Also Read :TDP : చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆరుగురు నేతలపై వేటు

‘‘సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించనందుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నాం..స్టేట్ లైసెన్స్ అథారిటీ అధికారి వయస్సు 55 సంవత్సరాలు.. ఇంకా ఐదేళ్ల సర్వీస్ మిగిలి ఉంది.. ఆయనకు ఓ కుటుంబం ఉంది.. గౌరవనీయమైన కోర్టు తీసుకునే చర్యలు అతని కెరీర్‌పై ప్రభావాన్ని చూపుతాయి’’ అని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పతంజలి కంపెనీ పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తుంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారని ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీపై చర్యలు ఎందుకు తీసుకోరాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో క్షమాపణలు కోరుతూ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం  అఫిడ్‌విడ్‌ను దాఖలు చేసింది. పతంజలి యాడ్స్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ 2023 సంవత్సరం నవంబరులో సుప్రీంకోర్టులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది.