Amazon layoffs ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో వరుస లేఆఫ్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. 2026లో రెండు నెలల కాలంలో ఈ సంస్థ 16 వేల మంది ఉద్యోగులను తొలగించింది. మరిన్ని తొలగింపులు ఉంటాయని అప్పుడే తెలిపింది. తాజాగా రోబోటిక్స్ విభాగంలోని ఉద్యోగులను తొలగిస్తోంది. సుమారు 100 మంది ఉద్యోగులపై ప్రభావం పడిందని సంబంధిత వ్యక్తులు వెల్లడించారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.
అమెజాన్ గోదాముల్లో పనిని ఆటోమేషన్ చేయడానికి రోబోలను డిజైన్ చేసే టీమ్ ఉంటుంది. ఈ రోబోటిక్స్ టీమ్‌పై ఇప్పుడు ప్రభావం పడింది. ఎంతమందిని తొలగించారన్నది అమెజాన్ వెల్లడించనప్పటికీ, లేఆఫ్‌లను మాత్రం ధ్రువీకరించింది.
వేర్ హౌస్‌లో కార్మికులకు సహాయపడేందుకు రోబోటిక్ విభాగమైన బ్లూజే గత సంవత్సరం అక్టోబర్‌లో రోబోలను ప్రదర్శించింది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఈ జనవరిలో వీటి తయారీని నిలిపివేసింది. ఈ క్రమంలో ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్‌లో 14 వేల మందిని తొలగించిన అమెజాన్, ఈ ఏడాది జనవరిలో 16 వేల మందిపై వేటు వేసింది. కృత్రిమ మేధ (ఏఐ), ఖర్చుల తగ్గింపులో భాగంగా ఈ కొద్ది కాలంలో 30 వేల మంది ఉద్యోగులను తొలగించింది.
