కొత్త ఏడాదిలో ఉద్యోగ విప్లవం: దేశవ్యాప్తంగా భారీ నియామకాల దిశగా కార్పొరేట్‌ రంగం

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉద్యోగాల సృష్టి మరింత పెరిగే అవకాశముందని సంస్థ పేర్కొంది. బృందాల విస్తరణ, క్యాంపస్‌ నియామకాల పునరుద్ధరణ, అలాగే వైవిధ్యం, సమానత్వం వంటి లక్ష్యాలపై కంపెనీలు గట్టి దృష్టి పెట్టడం ఇందుకు ప్రధాన కారణాలుగా టీమ్‌లీజ్‌ విశ్లేషించింది.

Published By: HashtagU Telugu Desk
Job revolution in the new year: Corporate sector set for massive recruitment drive across the country

Job revolution in the new year: Corporate sector set for massive recruitment drive across the country

. నైపుణ్యాల ఆధారంగా నియామక ప్రణాళికలు

. భారీ ప్రణాళికల్లో గోద్రేజ్, టాటా, మోతీలాల్‌ ఓస్వాల్‌

. ఈవై ఇండియా, డియాజియోలో భారీ నియామకాలు

Appointments : కొత్త సంవత్సరం దేశీయ ఉద్యోగ మార్కెట్‌కు ఆశాజనక సంకేతాలు ఇస్తోంది. 2026లో దేశవ్యాప్తంగా కంపెనీలు భారీ సంఖ్యలో నియామకాలకు సిద్ధమవుతున్నాయని స్టాఫింగ్‌ సేవల సంస్థ టీమ్‌లీజ్‌ తన తాజా అంచనాల్లో వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉద్యోగాల సృష్టి మరింత పెరిగే అవకాశముందని సంస్థ పేర్కొంది. బృందాల విస్తరణ, క్యాంపస్‌ నియామకాల పునరుద్ధరణ, అలాగే వైవిధ్యం, సమానత్వం వంటి లక్ష్యాలపై కంపెనీలు గట్టి దృష్టి పెట్టడం ఇందుకు ప్రధాన కారణాలుగా టీమ్‌లీజ్‌ విశ్లేషించింది. అంచనాల ప్రకారం 2026లో దేశీయ కార్పొరేట్‌ రంగం 1 నుంచి 1.2 కోట్ల వరకు కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చు. ఇదే 2025లో 80 లక్షల నుంచి కోటి మధ్యలో ఉండనుందని అంచనా. డిజిటలైజేషన్‌, కొత్త టెక్నాలజీలు, గ్లోబల్‌ మార్కెట్లతో అనుసంధానం పెరగడం వల్ల ఉద్యోగావకాశాల విస్తృతి పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొత్త నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు తమ నియామక వ్యూహాలను విస్తరిస్తున్నాయి. ఒకవైపు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతులను ఆకర్షిస్తూనే, మరోవైపు అన్ని విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుతున్నట్లు హెచ్‌ఆర్‌ వర్గాలు వెల్లడించాయి. డిజిటల్‌ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్‌, సరఫరా గొలుసు నిర్వహణ, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. క్యాంపస్‌ నియామకాలు కూడా తిరిగి ఊపందుకుంటున్నాయి. ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, లా, అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల నుంచి నేరుగా యువతను నియమించుకోవడంపై అనేక సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. దీని వల్ల ఫ్రెషర్లకు అవకాశాలు పెరగడమే కాకుండా, సంస్థలకు కూడా దీర్ఘకాలికంగా ప్రతిభను తీర్చిదిద్దుకునే అవకాశం లభిస్తోంది. భారీ నియామకాలకు సిద్ధమవుతున్న సంస్థల్లో నైపుణ్య సేవల రంగానికి చెందిన ఈవై ఇండియా ముందంజలో ఉంది.

2026 జూన్‌ నాటికి 14,000 నుంచి 15,000 మంది వరకు కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికలు ఉన్నాయని కంపెనీ చీఫ్‌ హెచ్‌ఆర్‌ అధికారి ఆర్తి దువా తెలిపారు. క్యాంపస్‌ నియామకాలు తమ సంస్థకు ఎప్పటినుంచో కీలకమని ఆమె పేర్కొన్నారు. బిజినెస్‌ స్కూల్స్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలు, లా కాలేజీలు, అండర్‌ గ్రాడ్యుయేట్‌ కార్యక్రమాల నుంచి ఏటా సుమారు 2,000 మందిని ఈవై ఇండియా నియమించుకుంటోంది. ప్రస్తుతం కంపెనీలో దేశవ్యాప్తంగా దాదాపు 50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా డియాజియో ఇండియా కూడా వృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. డిజిటల్‌ విభాగాలు, సరఫరా కార్యకలాపాలు, వ్యాపార విస్తరణ వంటి అవసరాలకు అనుగుణంగా నియామకాలు ఉంటాయని కంపెనీ సీహెచ్‌ఆర్‌ఓ శిల్పా తెలిపారు. లింగ వైవిధ్యాన్ని మెరుగుపరచడం తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో 30 శాతం, నాయకత్వ పదవుల్లో 31 శాతం మహిళలు ఉన్నారు. కాగా, 2026 దేశీయ ఉద్యోగ మార్కెట్‌కు కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీల విస్తరణ ప్రణాళికలు, నైపుణ్యాల ఆధారిత నియామకాలు, వైవిధ్య లక్ష్యాలు కలిసి ఉద్యోగార్థులకు కొత్త ఆశలను కలిగిస్తున్నాయి.

ఇతర కంపెనీలు సైతం..

. వర్ధమాన, భవిష్యత్‌కు అవసరమైన ఉద్యోగుల నియామకాలకు టాటా మోటార్స్‌ మొగ్గుచూపుతోంది. బ్యాటరీ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ డిఫైన్డ్‌ వాహనాలు, హైడ్రోజన్‌ ఇంధనం, ఇంజినీరింగ్, ఆర్‌ అండ్‌ డీ, వాణిజ్య కార్యకలాపాలు, కస్టమర్‌ సర్వీస్‌ వంటి విభాగాల్లో నియామకాలపై దృష్టి పెట్టింది.
. నియామకాల వ్యూహంలో భాగంగా వైవిధ్యమైన శ్రామికశక్తిని గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ ఆశిస్తోంది. దివ్యాంగులు, ఎల్‌జీబీటీక్యూ, సిస్‌ మహిళల ప్రాతినిధ్యాన్ని 31% నుంచి 2026-27కు 33 శాతానికి పెంచాలని భావిస్తోంది.
. టెక్, డేటా సైన్స్, ఏఐ, సపోర్ట్‌ ఉద్యోగుల కోసం చూస్తున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వెల్లడించింది. నాయకత్వ పదవుల్లో మహిళలను పెంచాలని భావిస్తున్నట్లు తెలిపింది.
. కొత్త నియామకాలతో పాటు ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడానికి పెట్టుబడులు కొనసాగిస్తామని ఎక్కువ శాతం కంపెనీలు స్పష్టం చేశాయి.

  Last Updated: 04 Jan 2026, 08:01 PM IST