Naresh Goyal : జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ముంబైలోని వారి నివాసంలో తుదిశ్వాస విడిచారు. తన భార్యతో పాటు నరేష్ గోయల్ కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి నరేష్ గోయల్‌ను 2023 సెప్టెంబర్ 1న ఈడీ అరెస్టు చేసింది. ఇవే ఆరోపణలతో అనితా గోయల్‌ను సైతం నవంబర్‌లో అరెస్ట్ చేశారు. అయితే అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా బాంబే హైకోర్టు ఆమెకు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న భార్యకు చివరి రోజుల్లో సపర్యలు చేసేందుకు మానవతా దృక్పథంతో అవకాశం ఇవ్వాలంటూ నరేష్ గోయల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల విచారించిన బాంబే హైకోర్టు.. ఆయనకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఈక్రమంలో భార్య వద్ద నరేష్ గోయల్ ఉండగానే ఆమె తుదిశ్వాస విడిచారు. నరేష్, అనితా గోయల్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో ఆమె ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షించేవారు.
We’re now on WhatsApp. Click to Join
జెట్ ఎయిర్‌వేస్ ద్వారా భారత విమానయాన రంగంలో నరేష్ గోయల్(Naresh Goyal) ఓ వెలుగు వెలిగారు. అయితే ఆయన కష్టాలు కెనరా బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నప్పటి నుంచి మొదలయ్యాయి. జెట్ ఎయిర్‌వేస్ గ్రూపునకు కెనరా బ్యాంక్ రూ.848 కోట్లకుపైగా లోన్ ఇచ్చింది. అయితే దీనిలో దాదాపు రూ.538.62 కోట్లను కంపెనీ తిరిగి పేమెంట్ చేయలేదు. దీంతో నరేష్ గోయల్‌పై కెనరా బ్యాంక్ కేసు పెట్టింది. ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని గుర్తించిన ఈడీ దర్యాప్తును చేపట్టింది. జెట్ ఎయిర్‌వేస్ తన రోజువారీ ఖర్చుల కోసం 10 బ్యాంకుల కన్సార్టియం నుంచి లోన్ తీసుకుందని ఈడీ తెలిపింది.