ITR Filing FY25: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR Filing FY25) దాఖలు చేసే వారికి ముఖ్యమైన వార్త. ఆదాయపు పన్ను శాఖ ఆర్థిక సంవత్సరం 2024-25 కోసం ITR దాఖలు చేయడానికి చివరి తేదీని పొడిగించింది. గతంలో ITR దాఖలు చేయడానికి గడువు 31 జులై 2025గా ఉండగా.. ఇప్పుడు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఈ గడువును పొడిగించింది. ఇప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ 15 సెప్టెంబర్ 2025గా నిర్ణయించబడింది. పన్ను చెల్లింపుదారులు 15 సెప్టెంబర్ వరకు ఎలాంటి జరిమానా లేకుండా ITR దాఖలు చేయవచ్చు. ఆదాయపు పన్ను శాఖ స్వయంగా ఈ సమాచారాన్ని అందించింది.
గడువు పొడిగింపు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
ITR ఫారమ్‌ల నోటిఫికేషన్ జారీలో జాప్యం కారణంగా గడువును పొడిగించే నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. ఈసారి ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్‌లలో పలు ముఖ్యమైన సవరణలు చేశారు. దీనికి అనుగుణంగా సిస్టమ్‌లో మార్పుల కోసం అదనపు సమయం అవసరం ఉంది. అందుకే రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ పొడిగించారు. ఇది అందరికీ సరైన ఫైలింగ్‌లో సహాయపడుతుంది. ITR ఫారమ్‌లు, సిస్టమ్ డెవలప్‌మెంట్ అవసరాలు, TDS క్రెడిట్ రిఫ్లెక్షన్‌లో అవసరమైన మార్పుల కారణంగా ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులకు ఎక్కువ సమయం ఇస్తుంది.
Also Read: NTRs Birth Anniversary : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులు
ఆదాయపు పన్ను రిటర్న్ ఎలా దాఖలు చేయాలి?
- ముందుగా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌కు (https://eportal.incometax.gov.in/) వెళ్లండి.
- ఆ తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో పాన్, యూజర్ ఐడీతో పాస్‌వర్డ్ సృష్టించి లాగిన్ చేయండి.
- డాష్‌బోర్డ్‌లో ఈ-ఫైల్ ఆదాయపు పన్ను రిటర్న్ ‘ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయండి’పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోండి (ఉదాహరణకు 2023-24) ‘కొనసాగండి’పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత ఆన్‌లైన్ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ITR దాఖలు చేయండి.
- మీ పన్ను ఆదాయం, TDS లెక్కింపు ఆధారంగా మీ ITR ఫారమ్‌ను ఎంచుకోండి.
- మీకు వర్తించే ITRని ఎంచుకున్న తర్వాత, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచి స్టార్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై కొన్ని ప్రశ్నలు కనిపిస్తాయి. మీకు వర్తించే వాటి చెక్‌బాక్స్‌లను గుర్తించి, కొనసాగండిపై క్లిక్ చేయండి.
- డాక్యుమెంట్ల ఆధారంగా మీ ఆదాయం, మినహాయింపుల వివరాలను వివిధ విభాగాలలో నమోదు చేయండి.
- పన్ను బాధ్యత ఉంటే మీరు అందించిన వివరాల ఆధారంగా పన్ను లెక్కింపు సంక్షిప్త వివరాలు కనిపిస్తాయి.
- లెక్కింపు ఆధారంగా పన్ను బాధ్యత ఉంటే ఇప్పుడు చెల్లించండి లేదా తర్వాత చెల్లించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
- ఒకవేళ పన్ను బాధ్యత లేకపోతే పన్ను చెల్లించిన తర్వాత, ‘ప్రివ్యూ రిటర్న్’పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ‘ప్రివ్యూ రిటర్న్ సమర్పించండి’ డిక్లరేషన్ చెక్‌బాక్స్‌పై క్లిక్ చేసి, ‘వెరిఫికేషన్ కోసం ముందుకు వెళ్లండి’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ప్రివ్యూ చూసి, ‘రిటర్న్ సమర్పించండి’ పేజీలో వెరిఫై కోసం ముందుకు వెళ్లండి. రిటర్న్‌ను వెరిఫై చేయడం, ఆమోదించడం తప్పనిసరి.
- ఈ-వెరిఫై పేజీలో మీరు ఈ-సత్యాపనం కోసం ఉపయోగించాలనుకునే ఆప్షన్‌ను ఎంచుకోండి. ‘కొనసాగండి’పై క్లిక్ చేయండి.
- ఒకసారి రిటర్న్‌ను ఈ-వెరిఫై చేసిన తర్వాత, ఫారమ్ విజయవంతంగా దాఖలు చేయబడిన సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ట్రాన్సాక్షన్ ఐడీ, ఎకనాలెడ్జ్‌మెంట్ నంబర్ స్క్రీన్‌పై అందుతాయి. దీనితో మీరు భవిష్యత్తులో మీ ITR ఫారమ్ స్థితిని తనిఖీ చేయవచ్చు.
- ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయబడిన మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి ఫారమ్ విజయవంతంగా దాఖలు చేయబడిన సందేశం అందుతుంది.
- రిటర్న్ దాఖలు చేసిన 30 రోజులలోపు వెరిఫై చేయడం మర్చిపోవద్దు.
ITR చివరి తేదీని మిస్ అయిన తర్వాత ఆలస్య రుసుము చెల్లించాలి
మీరు ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన గడువు అంటే 15 సెప్టెంబర్ 2025 వరకు మీ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయకపోతే మీకు ఆలస్య రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 2024-25 కోసం ఆలస్య రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2025. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 234F కింద ఆలస్య రుసుమును విధిస్తుంది. ఇది మీ ఆదాయ స్థాయిని బట్టి గరిష్టంగా 5,000 రూపాయల వరకు ఉంటుంది. 5 లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు గరిష్ట జరిమానా 1,000 రూపాయలు. మీరు పన్నును సకాలంలో చెల్లించకపోతే మిగిలిన బకాయి పన్నుపై నెలవారీ 1% వడ్డీ విధించబడుతుంది. మీకు రిఫండ్ రావాల్సి ఉంటే.. ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేయడం వల్ల అది ఆలస్యంగా అందుతుంది. సకాలంలో రిటర్న్ దాఖలు చేయకపోతే ఆదాయపు పన్ను నోటీసు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.