ITR Filing 2025: ఇటీవల ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR Filing 2025) దాఖలు చేయడానికి చివరి తేదీని జులై 15 నుండి సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించింది. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. వార్షిక జీతం ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే ఎక్కువ ఉన్న వారికి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం తప్పనిసరి. అసెస్‌మెంట్ ఇయర్ 2025-26 కోసం ITR దాఖలు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇంటి నుండి ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎలా దాఖలు చేయవచ్చు? వేతన జీవులకు (నెలవారీ జీతాలు తీసుకునే ఉద్యోగస్తులు) ఈ ప్రక్రియ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? అనేది వివరంగా తెలుసుకుందాం.
ఉద్యోగస్తులు కొంత వేచి ఉండాలి
ఆదాయపు పన్ను శాఖ నుండి ITR ఫారమ్‌లు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఉద్యోగస్తులు ఇంకా కొంత సమయం వేచి ఉండాలి. జూన్ 15 నుండి వేతన జీవులకు రిటర్న్ దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నిజానికి ఈ తేదీ తర్వాతే ఉద్యోగులకు ఫారమ్ 16 అందుతుంది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు జూన్ చివరిలో లేదా జులై వరకు ఫారమ్ 16 అందిస్తాయి. ఆ తర్వాత ITR లేదా TDS రిటర్న్ దాఖలు చేయవచ్చు.
ITR ఎలా దాఖలు చేయాలి?
ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ITR దాఖలు ప్రక్రియను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ITR దాఖలును సులభతరం చేయడానికి ఆదాయపు పన్ను శాఖ కొంతకాలం క్రితం ITR యూటిలిటీ టూల్స్‌ను కూడా విడుదల చేసింది. మీరు ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ITR దాఖలు చేయవచ్చు.
ITR దాఖలు దశలవారీ ప్రక్రియ
- ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కు వెళ్లండి.
- లాగిన్ కోసం మీ ఐడీగా పాన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- “e-File”పై క్లిక్ చేసిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్‌పై క్లిక్ చేయండి.
- అసెస్‌మెంట్ ఇయర్ కోసం “AY 2025-26”ని ఎంచుకోండి. ఆ తర్వాత ఆన్‌లైన్‌పై క్లిక్ చేయండి.
- మీ కోసం ITR దాఖలు చేస్తున్నట్లయితే Individualని ఎంచుకోండి.
- ఆ తర్వాత సరైన ITR ఫారమ్‌ను ఎంచుకోండి. సమాచారాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి.
- పాన్ కార్డ్, పేరు, ఆధార్ కార్డ్, బ్యాంక్ వివరాలతో సహా సమాచారాన్ని తనిఖీ చేయండి.
- చివరగా ITR కోసం ధృవీకరించండి. దీని కోసం ఆధార్ OTPని ఎంచుకోవచ్చు.
- మీరు కోరుకుంటే ITR-V ప్రింట్ ఔట్ తీసుకోండి. దానిపై సంతకం చేసి సీపీసీ, బెంగళూరుకు పంపవచ్చు.