Bank Holiday: ఈరోజు మీరు బ్యాంక్ పని మీద వెళ్లే ప్లాన్‌లో ఉంటే దయచేసి దానిని వాయిదా వేసుకోండి. ఈరోజు ఏప్రిల్ 3, 2026న ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారిక సెలవుల క్యాలెండర్ ప్రకారం.. ఇది నోటిఫై చేయబడిన బ్యాంక్ సెలవు దినం.
దీనివల్ల ఉత్తర భారతదేశంలోని న్యూఢిల్లీ నుండి కాన్పూర్, రాయ్‌పూర్, రాంచీ వరకు బ్యాంకులు మూసి ఉంటాయి. అలాగే దక్షిణ భారతదేశంలోని బెంగళూరు, చెన్నై, కొచ్చి వంటి నగరాల్లోనూ బ్యాంకులు పనిచేయవు. తూర్పు భారతదేశంలో కోల్‌కతా, పాట్నా, భువనేశ్వర్, పశ్చిమ భారతదేశంలో ముంబై, అహ్మదాబాద్, నాగ్‌పూర్ వంటి నగరాల్లోని బ్యాంకులకు ఈరోజు సెలవు.
ప్రభుత్వం ముందుగానే తమ క్యాలెండర్‌లో ప్రకటించే సెలవును ‘Notified Holiday’ అంటారు. బ్యాంకుల విషయంలో దీనిని ‘నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్’ కింద ప్రకటిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఏదైనా రోజును ‘నోటిఫై’ చేసినప్పుడు దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ శాఖలను తప్పనిసరిగా మూసివేయాలి. ఈ రోజున బ్యాంకుల్లో అన్ని రకాల లావాదేవీలు, పేపర్‌వర్క్ చట్టబద్ధంగా నిలిపివేయబడతాయి.
Also Read: ఐపీఎల్ 2026లో సరికొత్త రికార్డు.. మొదటి ఓవర్‌లోనే అత్యధిక పరుగులు!
ఏ సేవలు అందుబాటులో ఉంటాయి?
బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. నగదు విత్ డ్రా చేసుకోవడానికి ATMలు అందుబాటులో ఉంటాయి. UPI, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి యాప్‌లు సాధారణంగానే పనిచేస్తాయి. ఆన్‌లైన్ బదిలీల కోసం IMPS, NEFT సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. బ్యాంకులు నేరుగా ఏప్రిల్ 4, శనివారం నాడు తిరిగి తెరుచుకుంటాయి. ఇది నెలలో మొదటి శనివారం కాబట్టి ఎటువంటి సెలవు ఉండదు. ఏప్రిల్ 4 తర్వాత ఏప్రిల్ 5 ఆదివారం కావడంతో బ్యాంకులు మళ్ళీ మూసి ఉంటాయి.
