మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds)లో పెట్టుబడి చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఈరోజు (మే 19, 2025 ) నుంచి మూడు కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఇవి న్యూ ఫండ్ ఆఫర్స్ (NFOs) కింద వస్తున్నాయి. వేర్వేరు కేటగిరీల్లో ఉండే ఈ ఫండ్లు, పెట్టుబడిదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపుదిద్దుకున్నాయి. ఈ మూడు ఫండ్లలో యూనిఫై ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 200 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్ ఉన్నాయి. పెట్టుబడి ముందు మీ రిస్క్ ప్రొఫైల్, పెట్టుబడి వ్యవధి, ఆర్థిక లక్ష్యాలను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
యూనిఫై మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చిన “యూనిఫై ఫ్లెక్సీ క్యాప్ ఫండ్” మే 19 నుంచి మే 30 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీల్లో పెట్టుబడి చేసే ఫ్లెక్సిబుల్ స్కీమ్. మరోవైపు మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ తీసుకొచ్చిన “మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ ఫండ్” మే 20 నుంచి జూన్ 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఇది థీమాటిక్ ఫండ్ కాగా, కనీస పెట్టుబడి రూ.500. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కంపెనీ “నిఫ్టీ 200 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్”ను మే 21 నుంచి జూన్ 4 వరకు అందుబాటులో ఉంచింది. ఇది ఇండెక్స్‌ను అనుసరిస్తుంది, కనీస పెట్టుబడి రూ.1,000గా నిర్ణయించారు.
పెట్టుబడి పెట్టె ముందు జాగ్రత్తలు తప్పనిసరి
ఈ మూడు ఫండ్లు కొత్తవైనా, వాటిలో పెట్టుబడి చేసే ముందు పెట్టుబడిదారులు తమ అవసరాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీకు ఎంత రిస్క్ తీసుకోగల సామర్థ్యం ఉంది? మీరు ఎంత కాలం పెట్టుబడి చేయాలనుకుంటున్నారు? మీ ఆర్థిక లక్ష్యాలు ఏవీ? అనే అంశాలను గమనించి నిర్ణయం తీసుకోవాలి. ఫండ్ ఎంపికలో తొందరపడకుండా, నిపుణుల సలహా తీసుకుని మాత్రమే ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. సరైన ఫండ్ ఎంపిక చేస్తే, దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఆశించవచ్చు.