Wedding Season: పెళ్లిళ్ల సీజన్ (Wedding Season) వచ్చేసరికి పండుగల సీజన్ కూడా సరిగ్గా ముగియలేదు. మార్కెట్లలో కార్యకలాపాలు పెరిగే సమయం ఇది. అటువంటి పరిస్థితిలో తాజాగా CAIT నివేదిక వచ్చింది. ఇందులోని లెక్కలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో రూ.6 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) తెలిపింది.
పెళ్లిళ్ల సీజన్ ఎప్పుడు మొదలవుతుంది?
ఈసారి భారతదేశంలో వివాహాల సీజన్ నవంబర్ 12 నుండి డిసెంబర్ 16 వరకు ఉంది. ఈ కాలంలో భారతదేశంలో దాదాపు 48 లక్షల వివాహాలు జరగవచ్చని, వీటి ద్వారా దాదాపు రూ.6 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ సంవత్సరం వివాహం జరిగే 18 శుభ తేదీలు ఉన్నాయి. నవంబర్‌లో వివాహానికి అనుకూలమైన తేదీలు 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29. డిసెంబర్ నెలలో 4, 5, 9, 10, 11, 14, 15, 16 వివాహానికి అనుకూలమైన తేదీలు.
Also Read: Caste census Survey : రాహుల్ ఇచ్చిన మాటను నెరవేర్చడమే తమ కర్తవ్యం – సీఎం రేవంత్
2023 కంటే ఎక్కువ వ్యాపారం
గత ఏడాది కంటే ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారం ఎక్కువ కానుంది. 2023 పెళ్లిళ్ల సీజన్‌లో 35 లక్షల పెళ్లిళ్లలో రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని నివేదిక తెలిపింది. ఈసారి గణాంకాలు గత సంవత్సరం కంటే ఈసారి చాలా ఎక్కువగా ఉండనున్నట్లు చెబుతున్నాయి.
గతేడాది కంటే ఈ ఏడాది శుభ ముహూర్తాలు కూడా ఎక్కువే. గతేడాది 11 శుభ తేదీలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ఒక్క ఢిల్లీలోనే 4.5 లక్షల పెళ్లిళ్లు జరగవచ్చని, దీని ద్వారా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని సమాచారం. డిసెంబర్ తర్వాత తదుపరి వివాహ సీజన్ జనవరి నుండి మార్చి 2025 వరకు ఉంటుంది.
ఎంత ఖర్చవుతుంది?
వినియోగదారుల షాపింగ్ ప్రవర్తనలో మార్పు కనిపించిందని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. ఇప్పుడు ప్రజలు విదేశీ వస్తువులకు బదులుగా భారతీయ ఉత్పత్తులపై ఆసక్తి చూపుతున్నారన్నారు. ఇది ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘వోకల్ ఫర్ లోకల్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ విజన్ విజయాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు.
ఇకపోతే బట్టలు, చీరలు, లెహంగాలు, గార్మెంట్స్‌పై మొత్తం ఖర్చులో 10 శాతం, ఆభరణాలపై 15 శాతం, ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలపై 5 శాతం, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, నామ్‌కీన్‌లపై 5 శాతం ఖర్చు అవుతుందని చెప్పారు. 5 శాతం సరుకులు, కూరగాయలపై, 4 శాతం బహుమతులపై, 6 శాతం ఇతర వస్తువులపై ఖర్చు చేస్తారని నివేదికలో పేర్కొన్నారు. ఇవే కాకుండా బాంక్వెట్ హాల్, హోటల్‌లో 5 శాతం, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో 3 శాతం, టెంట్ డెకరేషన్‌లో 10 శాతం, క్యాటరింగ్ సర్వీసెస్‌లో 10 శాతం, డెకరేషన్‌లో 4 శాతం, ట్రాన్స్‌పోర్టేషన్, ట్యాక్సీ సర్వీసుల్లో 3 శాతం, 2 శాతం ఫోటోగ్రఫీ- వీడియోగ్రఫీకి, 3 శాతం ఆర్కెస్ట్రా- సంగీతానికి, 7 శాతం ఇతర సేవలకు ఖర్చు చేస్తారని నివేదిక తెలిపింది.