Site icon HashtagU Telugu

IDBI Bank: మ‌రో బ్యాంక్‌ను ప్రైవేటీకరణ చేయ‌నున్న కేంద్రం.. డెడ్ లైన్ ఇదే!

IDBI Bank

IDBI Bank

IDBI Bank: ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) లిమిటెడ్‌లో తమకున్న 60.72% వాటాకు సమానమైన 7.1 బిలియన్ డాలర్ల వాటాను విక్రయించే ప్రక్రియలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. త్వరలోనే దీనికి బిడ్లు వేసే ఏర్పాటు చేయవచ్చు. ఇది గతంలో ఇబ్బందుల్లో ఉన్న ఈ బ్యాంకును ప్రైవేటీకరించడానికి, పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి చాలా కాలంగా జరుగుతున్న ప్రయత్నాలలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు.

ఈ విషయంపై అవగాహన ఉన్న వర్గాల సమాచారం ప్రకారం.. సంభావ్య కొనుగోలుదారులతో చర్చలు ముందస్తు దశలో ఉన్నాయి. బిడ్డింగ్ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభం కావచ్చని కూడా చెబుతున్నారు. అంతా సవ్యంగా జరిగితే దశాబ్దాల తర్వాత ఒక ప్రభుత్వరంగ బ్యాంకు ప్రైవేటీకరణ జరుగుతుంది.

ఇటీవల సంవత్సరాలలో మెరుగైన బ్యాంకు పరిస్థితి

ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంకులో 60.72% వాటాను విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐడీబీఐ బ్యాంక్ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దీని విలువ సుమారు 7.1 బిలియన్ డాలర్లు. భారీ రుణ భారం కింద నలిగిన ఈ బ్యాంకు, ఇటీవల సంవత్సరాలలో నిర్వహణ మెరుగుదల తర్వాత కోలుకుంది. మూలధన మద్దతు, వేగవంతమైన రికవరీ చర్యల ద్వారా నిరర్థక ఆస్తులను (NPAలు) వేగంగా తగ్గించడంలో సహాయం లభించిన తర్వాత బ్యాంకు లాభాల్లోకి తిరిగి వచ్చింది.

ప్రైవేటీకరణ ఎప్పటికి పూర్తవుతుంది?

బ్యాంకు ఇప్పుడు లాభాల్లో ఉండటం, బకాయి రుణాల తిరిగి చెల్లింపు జరుగుతుండటం, బ్యాలెన్స్ షీట్ పరిస్థితి కూడా గతంలో కంటే మెరుగ్గా ఉండటం వలన ప్రభుత్వం ఇప్పుడు దీనిని ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించడానికి సిద్ధంగా ఉంది. అయితే నియంత్రణ ఆమోదం పొందడంలో ఆలస్యం వంటి అనేక ఇతర సమస్యల కారణంగా ప్రభుత్వం అమ్మకాలను పూర్తి చేయడానికి నిర్దేశించిన గత గడువును కోల్పోయింది. ప్రైవేటీకరణను మార్చి 2026 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

Also Read: Tri-Service Guard Of Honour: త్రి-సేవా గార్డ్ ఆఫ్ ఆనర్.. దాని అర్థం ఏమిటి?

బిడ్డింగ్ రేసులో ఎవరున్నారు?

షార్ట్‌లిస్ట్ చేయబడిన బిడ్డర్లు ప్రస్తుతం డ్యూ డిలిజెన్స్ అంటే బ్యాంకును నిశితంగా పరిశీలిస్తున్నారు. బ్యాంకును కొనుగోలు చేయడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, ఎమిరేట్స్ NBD PJSC, ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆసక్తి చూపాయి. కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కు ఐడీబీఐ బ్యాంక్‌లో కలిపి సుమారు 95% వాటా ఉంది. ప్రభుత్వం తన 30.48% వాటాను విక్రయిస్తుంది. అయితే ఎల్‌ఐసి మేనేజ్‌మెంట్ నియంత్రణ బదిలీతో పాటు 30.24% వాటాను విక్రయిస్తుంది.

కస్టమర్లపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

బ్యాంకు అమ్ముడుపోయి ప్రైవేటీకరణ వైపు వెళ్లడం వల్ల కొన్ని మార్పులు తప్పకుండా ఉంటాయి. కానీ దాని ప్రభావం బ్యాంకు ఖాతాదారులపై పడదు. బ్యాంకు ఖాతాలు, రుణాల మొత్తం అన్నీ యథాతథంగా కొనసాగుతాయి. పైగా ప్రైవేటీకరణ తర్వాత కస్టమర్లకు మరింత మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉంది. కొన్ని చిన్న మార్పులు చేయాల్సి రావచ్చు. ఉదాహరణకు లాగిన్ ఐడి మారవచ్చు లేదా చెక్‌బుక్ లేదా పాస్‌బుక్‌లో మార్పులు ఉండవచ్చు. రాబోయే కాలంలో దీని ప్రభావం బ్యాంకు షేర్లపైనా కనిపించవచ్చు.

Exit mobile version