. లగ్జరీ కార్లపై సుంకాల తగ్గింపు ప్రధాన ఆకర్షణ
. యూరోపియన్ ఆటో దిగ్గజాలకు భారత్‌లో కొత్త అవకాశాలు
. ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా మారనున్న ఒప్పందం
India-European Union: భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) త్వరలోనే తుది దశకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చలు ఇప్పుడు నిర్ణాయక మలుపు తిరిగినట్లు అంతర్జాతీయ వాణిజ్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఒప్పందంలో ముఖ్యంగా లగ్జరీ కార్ల దిగుమతులపై విధిస్తున్న టారిఫ్‌ల అంశం ప్రధాన చర్చాంశంగా మారింది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే ఖరీదైన కార్లపై సుమారు 110 శాతం వరకు సుంకాలు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ టారిఫ్‌లను దశలవారీగా 40 శాతానికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం 15 వేల యూరోల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ వాహనాలకు ఈ రాయితీ వర్తించే అవకాశం ఉంది. ఇది అమల్లోకి వస్తే భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో పెద్ద మార్పులు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సుంకాలను మరింతగా తగ్గించే అవకాశాలూ ఉన్నాయని కథనాలు పేర్కొంటున్నాయి.
అయితే ఈ అంశంపై ఇప్పటివరకు భారత వాణిజ్య శాఖగానీ, యూరోపియన్ యూనియన్ కమిషన్‌గానీ అధికారిక ప్రకటన చేయలేదు. టారిఫ్‌ల తగ్గింపు అమలైతే యూరోపియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలకు భారత మార్కెట్ మరింత ఆకర్షణీయంగా మారనుంది. వోక్స్‌వ్యాగన్, మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే భారత్‌లో తమ ఉనికిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధిక సుంకాల కారణంగా ఇప్పటివరకు ఈ కార్లు పరిమిత వినియోగదారులకే అందుబాటులో ఉండగా కొత్త విధానం వల్ల ధరలు కొంత తగ్గే అవకాశం ఉంది. దీని ద్వారా పోటీ పెరగడమే కాకుండా, వినియోగదారులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వస్తాయి. అలాగే ఈ ఒప్పందం ద్వారా కేవలం ఆటోమొబైల్ రంగమే కాకుండా, సేవలు, తయారీ, డిజిటల్ వాణిజ్యం వంటి అనేక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం విస్తరించే అవకాశం ఉంది. భారత్ నుంచి ఈయూ దేశాలకు ఎగుమతులు పెరగడంతో పాటు యూరోప్ నుంచి ఆధునిక సాంకేతికత పెట్టుబడులు భారత్‌కు రావడానికి ఇది దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ఇటీవల యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లేయెన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తించాయి. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఆమె మాట్లాడుతూ..“ఈ ఒప్పందం దిశగా ఇంకా చేయాల్సిన పని ఉన్నప్పటికీ మేము చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం వైపు అడుగులు వేస్తున్నాం. కొందరు దీనిని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణిస్తున్నారు” అని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా కోట్లాది మంది ప్రజలకు వస్తువులు సేవల ఎగుమతి–దిగుమతుల్లో సులభతరం కలుగుతుందని, ఇది ప్రపంచ జీడీపీలో సుమారు 25 శాతానికి సమానమని ఆమె వివరించారు. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఉర్సులా వాన్‌డెర్ లేయెన్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావడం కూడా ఈ ఒప్పందానికి ప్రాధాన్యతను మరింత పెంచింది. ఈ పర్యటన నేపథ్యంలోనే ఎఫ్‌టీఏ చర్చలు తుది దశకు చేరే అవకాశాలు బలపడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఒప్పందం ఖరారైతే భారత్–యూరోప్ సంబంధాల్లో ఇది కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లే.
