Income Tax Rules 2026: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ శుక్రవారం, మార్చి 20న ఈ-గెజిట్ ద్వారా ఆదాయపు పన్ను నియమాలు, 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 64 ఏళ్ల నాటి ఆదాయపు పన్ను నియమాలు, 1962 స్థానంలో వస్తాయి. పన్ను నిబంధనల భాషను సరళీకరించడం, కోర్టు కేసులను తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.
కొత్త ఆదాయపు పన్ను నిబంధనలలో వచ్చే మార్పులు
నిబంధనలలో భారీ కోత.. 511 నుండి 333కి తగ్గింపు
పన్ను విధానాన్ని సరళీకృతం చేసేందుకు ప్రభుత్వం నిబంధనల సంఖ్యను 511 నుండి కేవలం 333కి తగ్గించింది. అదేవిధంగా ఫారమ్‌ల సంఖ్యను కూడా 399 నుండి 190కి తగ్గించారు. దీనివల్ల టాక్స్ ఫైలింగ్ సంక్లిష్టత గణనీయంగా తగ్గుతుంది.
HRA కోసం 4 కొత్త మెట్రో నగరాలు
ఉద్యోగులకు అతిపెద్ద ఊరటనిచ్చే అంశం HRA (ఇంటి అద్దె భత్యం) మినహాయింపు. ఇప్పటివరకు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై అనే 4 నగరాల్లో మాత్రమే 50% HRA మినహాయింపు లభించేది. ఇప్పుడు ఈ జాబితాలో మరో 4 నగరాలు చేరాయి. బెంగళూరు, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్. ఈ నగరాల్లో నివసించే ఉద్యోగులు కూడా ఇప్పుడు తమ బేసిక్ శాలరీలో 50% వరకు HRA క్లెయిమ్ చేసుకోవచ్చు.
Also Read: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు!
- పిల్లల చదువు, హాస్టల్ అలవెన్స్ 30 రెట్లు పెంపు
- దశాబ్దాల నాటి అలవెన్సుల పరిమితిలో చారిత్రాత్మక మార్పులు చేశారు.
- Education Allowance: నెలకు రూ. 100 నుండి నేరుగా రూ. 3,000కి (ఒక్కో బిడ్డకు) పెంచారు.
- Hostel Allowance: నెలకు రూ. 300 నుండి నేరుగా రూ. 9,000కి (ఒక్కో బిడ్డకు) పెంచారు.
ఆఫీసులో భోజనం ఇకపై రూ. 200 వరకు ఫ్రీ
ఇప్పటివరకు ఆఫీసులో లభించే ఉచిత భోజనంపై పన్ను మినహాయింపు పరిమితి ఒక్కో పూటకు రూ. 50గా ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం దీనిని రూ. 200కి పెంచారు. అంటే ఇప్పుడు ఖరీదైన కూపన్లు లేదా క్యాంటీన్ ఫుడ్ విషయంలో పన్ను ఆందోళన తగ్గుతుంది.
యజమానితో సంబంధాన్ని వెల్లడించడం తప్పనిసరి
పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. మీరు మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా బంధువులకు అద్దె చెల్లించి HRA క్లెయిమ్ చేస్తుంటే ఇప్పుడు Form 124లో యజమానితో మీకు ఉన్న సంబంధాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే ఏడాదికి రూ. 1 లక్ష కంటే ఎక్కువ అద్దె చెల్లిస్తే యజమాని PAN వివరాలు ఇవ్వడం తప్పనిసరి.
గిఫ్ట్- లోన్ పరిమితిలో మార్పులు
Gifts: కంపెనీ నుండి అందే బహుమతులు ఇప్పుడు రూ. 15,000 వరకు టాక్స్-ఫ్రీ (గతంలో ఇది రూ. 5,000).
Loans: కంపెనీ నుండి తీసుకునే రూ. 2 లక్షల వరకు వడ్డీ లేని రుణాలపై ఇకపై ఎటువంటి పన్ను ఉండదు.
