Income Tax Refund: పన్ను చెల్లింపుదారుడు ఆర్థిక సంవత్సరం 2024-25కు సకాలంలో ఆదాయపు పన్ను చెల్లించినప్పటికీ రిఫండ్ (Income Tax Refund) ప్రాసెసింగ్ ఆలస్యమైతే అందుకు అనేక కారణాలు ఉండవచ్చు. సాధారణంగా రిఫండ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలు సరిపోలకపోవడం. ఆదాయపు పన్ను ఫైల్ చేసేటప్పుడు పాన్, ఆధార్ లింక్ అయి ఉండటం తప్పనిసరి. ఇందులో ఏదైనా లోపం ఉంటే రిఫండ్ రావడంలో ఆలస్యం జరుగుతుంది.
రిఫండ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు
బ్యాంకు వివరాల్లో తప్పులు: మీరు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు బ్యాంకు ఖాతా నంబర్ లేదా IFSC కోడ్‌ను తప్పుగా నమోదు చేస్తే రిఫండ్ మీ ఖాతాలోకి రాదు. కాబట్టి మీ బ్యాంకు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడం ముఖ్యం.
Also Read: SBI Card: మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఈ రూల్స్ తెలుసా?
అదనపు పత్రాల కోసం డిమాండ్: మీరు క్లెయిమ్ చేసిన రిఫండ్ కోసం పన్ను శాఖ అదనపు పత్రాలను అడిగి, వాటిని మీరు సకాలంలో సమర్పించకపోతే, రిఫండ్ ఆలస్యం అవుతుంది. తప్పుడు సమాచారం ఇస్తే కూడా పన్ను శాఖ విచారణ జరపవచ్చు. నోటీసు జారీ చేయవచ్చు.
ఫారం 26AS లేదా ఫారం 16లో వ్యత్యాసాలు: ఫారం 26AS (Annual Information Statement) లేదా ఫారం 16లో ఇచ్చిన సమాచారం మరియు మీ రిటర్న్‌లో ఉన్న వివరాలు సరిపోలకపోతే, రిఫండ్ ప్రక్రియ నిలిచిపోతుంది. ఇలాంటి సందర్భంలో మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ధృవీకరణ పూర్తయ్యాక మాత్రమే రిఫండ్ విడుదల చేస్తారు.
రిఫండ్ ప్రక్రియకు ఎంత సమయం పడుతుంది?
పన్ను చెల్లింపుదారుడు తన రిటర్న్‌ను ఈ-ధృవీకరించిన తర్వాతే ఆదాయపు పన్ను శాఖ రిఫండ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. సాధారణంగా పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాలోకి డబ్బు జమ కావడానికి 4 నుంచి 5 వారాల సమయం పడుతుంది. ఈ గడువు తర్వాత కూడా రిఫండ్ రాకపోతే పన్ను చెల్లింపుదారుడు తన ఐటీఆర్ (ITR)లో ఏవైనా లోపాలు ఉన్నాయేమో చూసుకోవాలి. అలాగే ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇమెయిల్‌లో వచ్చిన నోటిఫికేషన్లను జాగ్రత్తగా పరిశీలించాలి.