Income Tax Notice: అధిక ఆదాయం కలిగిన వృత్తి నిపుణులు, ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీలు, స్టార్టప్‌ల సీనియర్ అధికారులపై ఆదాయపు పన్ను (Income Tax) శాఖ చర్యలను ముమ్మరం చేసింది. వార్షిక ఆదాయం రూ. 50 లక్షల కంటే ఎక్కువగా ఉండి పన్ను ఆదా చేయడం కోసం తప్పుడు క్లెయిమ్‌లు లేదా తప్పుడు సమాచారాన్ని సమర్పించిన వారు ఇప్పుడు ఐటీ శాఖ రాడార్‌లో ఉన్నారు.
నివేదికల ప్రకారం.. నోటీసులు అందుకున్న వారిలో పెద్ద కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. కఠిన చర్యలు తీసుకునేముందు వారి ఆదాయపు పన్ను రిటర్నులలో ఉన్న వ్యత్యాసాలను సరిదిద్దుకోవడానికి ఐటీ శాఖ వారికి ఒక అవకాశం కల్పించింది.
నోటీసులు ఎందుకు పంపిస్తున్నారు?
ఆదాయపు పన్ను శాఖ ప్రధానంగా ఈ క్రింది అంశాలపై దర్యాప్తు చేస్తోంది.
విదేశీ ఆదాయం: విదేశాల నుండి వచ్చిన ఆదాయాన్ని వెల్లడించకుండా దాచిపెట్టడం.
తప్పుడు క్లెయిమ్‌లు: హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రావెల్ అలవెన్స్‌లను వాస్తవం కంటే ఎక్కువగా చూపించడం.
నకిలీ విరాళాలు: స్వచ్ఛంద సంస్థలు లేదా విద్యా సంస్థలకు నకిలీ విరాళాలు ఇచ్చినట్లు చూపి పన్ను మినహాయింపు పొందడం.
ఆస్తుల కొనుగోలు: ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేసినప్పుడు ఆదాయ వనరులను సరిగ్గా వివరించకపోవడం.
క్రిప్టో కరెన్సీ: విదేశీ క్లయింట్ల నుండి క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు పొంది వాటిని ఆదాయంగా ప్రకటించకపోవడం.
రాజకీయ విరాళాలు: గుర్తింపు లేని లేదా ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినట్లు చూపడం. ముఖ్యంగా ఎఫ్.ఎమ్.సి.జి (FMCG), హాస్పిటాలిటీ, ఐటీ, ఆటోమొబైల్, ఇంజనీరింగ్-కన్స్ట్రక్షన్ రంగాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ విచారణ పరిధిలో ఉన్నారు.
Also Read: అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?
తనిఖీలు ఎందుకు కఠినతరం అయ్యాయి?
ఇటీవలి కాలంలో డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సాధనాల ద్వారా అధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుల రిటర్నులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలు, విదేశీ ఆస్తులు, క్రాస్-బార్డర్ లావాదేవీల డేటాను సరిపోల్చడం ద్వారా వ్యత్యాసాలను సులభంగా గుర్తిస్తున్నారు.
రిటర్నులలో ఏదైనా తప్పు లేదా తప్పుడు క్లెయిమ్ ఉంటే, దానిని స్వచ్ఛందంగా సరిదిద్దుకోండి. లేనిపక్షంలో పెనాల్టీ, వడ్డీ, చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక ఆదాయ వర్గాల్లో పన్ను నిబంధనల అమలును నిర్ధారించడానికి, నకిలీ క్లెయిమ్‌లను అరికట్టడానికి ఇది ఒక కఠినమైన చర్యగా పరిగణించబడుతోంది.
