ప్రస్తుత డిజిటల్ యుగంలో మనం రోజువారీ జీవితంలో ఎన్నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను (Electronic Goods) ఉపయోగిస్తున్నాం. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, కెమెరాలు, ప్రింటర్లు వంటి అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు మన జీవన శైలిలో అంతర్భాగమైపోయాయి. అయితే కొత్త మోడళ్ల రాకతో లేదా పాతవి పనిచేయకపోవడంతో ఇంట్లోనే మూలన పడేస్థుంటారు. ఇక్కడ మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. అటువంటి పాత ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
IAS Officers : ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్ క్లాస్
పాత గ్యాడ్జెట్లను అమ్మడం ఎలా?
ఇప్పుడు పాత ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే పలు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పని చేయకపోయినా వాటిలోని భాగాలను రీసైకిల్ చేయడం ద్వారా కొత్త వస్తువుల తయారీలో ఉపయోగిస్తున్నారు. మీ వద్ద పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువుల వివరాలను ఈ సంస్థల వెబ్‌సైట్‌లలో నమోదు చేస్తే, వారు మీ ఇంటికి వచ్చి వాటిని కొనుగోలు చేస్తారు. పరికరాల స్థితిని బట్టి వారు మిమ్మల్ని సంప్రదించి, తగిన మొత్తాన్ని చెల్లిస్తారు.
ఈ-వేస్ట్ సేకరణపై గణాంకాలు
భారతదేశంలో 2023-24 నాటికి సుమారు 57 శాతం ఈ-వేస్ట్ సేకరించలేదని ఒక సర్వేలో తేలింది. ఇది దాదాపు 9.9 లక్షల మెట్రిక్ టన్నులకు సమానం. ఈ-వేస్ట్ సేకరణ సరైన విధంగా జరగకపోవడం వల్ల పునర్వినియోగానికి (రిసైక్లింగ్) అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా కొత్త ఎలక్ట్రానిక్ వస్తువుల కొరత ఏర్పడుతోంది. పాత పరికరాలను సేకరించి రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణానికి కూడా మేలు చేయొచ్చు.
ఈ-వేస్ట్ కొనుగోలు చేసే సంస్థలు
ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థలలో ఎన్‌విరోకేర్, క్యాషిఫై, జోలోపిక్, ఐటీపికప్, రీసెల్‌ఫోన్ వంటి సంస్థలు ప్రముఖంగా ఉన్నాయి. ఈ సంస్థల వెబ్‌సైట్‌లలోకి వెళ్లి, మీరు అమ్మాలనుకుంటున్న వస్తువుల వివరాలను నమోదు చేయాలి. మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా వారు మిమ్మల్ని సంప్రదించి, వస్తువుల స్థితిని అంచనా వేసి తగిన మొత్తాన్ని చెల్లిస్తారు. పాత ఎలక్ట్రానిక్ వస్తువులను రీసైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణ హాని తగ్గటమే కాకుండా, కొత్త ఉత్పత్తుల తయారీకి అవసరమైన మెటీరియల్స్‌ను మళ్లీ ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. అంతేగాక, మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. కాబట్టి ఇక నుంచి పనికిరాని పాత మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు ఇంట్లో ఉంచకుండా, వాటిని అమ్మేసి డబ్బులు సంపాదించుకోండి.