దేశంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) ప్రైవేటీకరణ (IDBI Bank Privatisation) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అర్హులైన బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Union Ministry of Finance) ప్రకటించింది. త్వరలోనే బ్యాంక్ ప్రైవేటీకరణ పూర్తవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ ఛౌద్రీ తెలిపారు. ప్రస్తుతం ఈ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం మరియు ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) వాటా కలిగి ఉండగా, 61 శాతం వాటాను విక్రయించే ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 45.48%, ఎల్ఐసీకి 49.24% వాటాలు ఉన్నాయి. 2023 జనవరిలో, ప్రైవేటీకరణ కోసం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (EOI) స్వీకరించగా, పలు సంస్థలు ప్రతిస్పందించాయి. హోం మంత్రిత్వ శాఖ నుండి సెక్యూరిటీ క్లియరెన్స్ వచ్చిందని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిట్ అండ్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ ఇచ్చిన తర్వాత, ఆసక్తి చూపిన సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించారని కేంద్ర మంత్రి తెలిపారు.
60.72% వాటా విక్రయానికి అనుమతించగా, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 30.48%, ఎల్ఐసీ వాటా 30.24% ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రైవేటీకరణ ప్రక్రియలో ఫెయిర్ ఫాక్స్ ఇండియా హోల్డింగ్స్ (సీఎస్‌బీ బ్యాంక్ ప్రమోటర్), ఎమిరేట్స్ ఎన్‌బీడీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి సంస్థలు ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. బ్యాంకు ప్రైవేటీకరణ పూర్తయితే, కొత్త యాజమాన్యం అధికారం చేపట్టనుంది.
ఇదిలా ఉండగా.. బ్యాంకు ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగులపై ప్రభావం పడుతుందా? అనే ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్ ఛౌద్రీ సమాధానమిచ్చారు. ప్రైవేటీకరణ అనంతరం ఉద్యోగుల చట్టపరమైన హక్కులను కాపాడేందుకు ప్రత్యేక నిబంధనలు షేర్ పర్చేస్ అగ్రిమెంట్‌లో (SPA) పొందుపరిచామని తెలిపారు. ఈ ప్రైవేటీకరణతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఉద్యోగులు, వాటాదారులు దీని ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.