Site icon HashtagU Telugu

Hyderabad : సంక్షోభంలో హైదరాబాద్ ..?

Hyderabad In Crisis

Hyderabad In Crisis

ఏడాది క్రితం వరకు హైదరాబాద్ (Hyderabad) అంటే చాలు అంత అబ్బా అనుకునేవారు..సామాన్య ప్రజల దగ్గరి నుడి కోటీశ్వర్ల వరకు అందరి చూపు హైదరాబాద్ పైనే ఉండేది. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని బిజినెస్ వర్గాలు భావిస్తే..సామాన్య , మధ్యతరగతి వారు నగరంలో ఓ చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలని భవిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటేనే భయపడుతున్నారు. ఏడాది కాలంగా హైదరాబాద్ నగర కళ తప్పింది. కొత్త పరిశ్రమలు రావడం లేదు..ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది. కొత్తగా ఇల్లు కొనాలనుకునేవారు ఆసక్తి చూపించడం లేదు.

హైదరాబాద్‌లో ఈ జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 12,082 యూనిట్లుగా ఉండొచ్చని ప్రాప్‌ఈక్విటీ చెప్తున్నది. గత ఏడాది ఇదే వ్యవధిలో 20,658 యూనిట్ల విక్రయాలు జరిగాయన్నది. దీంతో తాజా సర్వేలో అన్ని నగరాల కంటే హైదరాబాద్‌లోనే అత్యంత క్షీణత నమోదవుతున్నది. గత ఏడాదిదాకా దేశంలోనే అత్యంత ఎక్కువగా ఇండ్ల అమ్మకాలు ఇక్కడ జరిగిన విషయం తెలిసిందే. ముంబై, బెంగళూరు వంటి నగరాలనూ దాటుకొని గడిచిన పదేండ్లలో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం దూసుకుపోయింది. కానీ ఇప్పుడు సీన్‌ రివర్సైంది. దీనికి కారణం అనేకం ఉన్నాయి. ప్రభుత్వం మారడం, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు , నగర వ్యాప్తమగు అభివృద్ధి తగ్గడం , క్రైమ్ రేట్ పెరుగుతుండడం ఇలా అనేక కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు.

ఇదే విషయాన్నీ మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రస్తావించారు. అభివృద్ధి చెందుతున్న మహానగరం సంక్షోభంలోకి వెళ్తుందనడానికి ఈ నివేదికనే నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్, కూల్చివేతల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోయిందన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవడంతో.. హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ మహా నగరం ఈరోజు గందరగోళ పరిస్థితుల్లో కూరుకుపోయిందంటూ కేటీఆర్ మండిపడ్డారు.

కేటీఆర్ అన్నారని కాదు కానీ నగర ప్రజలు కూడా ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా హైడ్రా వల్ల ప్రభుత్వానికి మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది. అక్రమ ఇల్లు కూల్చడం తప్పు కాదు..కానీ కాస్త సమయం ఇస్తే బాగుంటుందని అంటున్నారు. అలాగే రాజకీయ నేతలకు ఓ న్యాయం..సామాన్య ప్రజలకు ఓ న్యాయం అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సీఎం సోదరులకు నెల టైం ఇచ్చి..సామాన్య ప్రజలకు కనీసం సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వక పోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి హైదరాబాద్ అంటే ఇప్పుడు వామ్మో అనుకునే స్థాయికి వచ్చిందని చెపుతున్నారు.

Read Also : Youtuber Harsha Sai : హర్షసాయి కోసం పోలీసుల గాలింపు..