దేశంలోని దిగ్గజ ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ సెక్టార్ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) ఈ ఆర్థిక సంవత్సరం 2025- 26 రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక ఏడాది జూలై- సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీకి ఏకీకృత నికర లాభం 3.8 శాతం పెరిగినట్లు తెలిపింది. ఈసారి కంపెనీ నెట్ ప్రాఫిట్ రూ. 2,694 కోట్లు ఆర్జించినట్లు తెలిపింది. గతేడాది రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 2,595 కోట్లతో పోలిస్తే ఈసారి 3.8 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌యూఎల్ కంపెనీ ఆదాయం రూ. 16,034 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో కంపెని ఆదాయం రూ. 15,703 కోట్లుగా ఉండగా ఈసారి 2.10 శాతం మేర పెరిగిందని వెల్లడించింది. కంపెనీ మొత్తం ఖర్చులు 3.32 శాతం మేర పెరిగి రూ. 12,999 కోట్లకు చేరాయని తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇతర ఆదాయలతో కలిపితే మొత్తం కంపెనీ ఆదాయం రూ. 16,388 కోట్లుగా ఉందని వెల్లడించింది. కేంద్రం ఇటీవలే తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు వినియోగాన్ని పెంచుతాయని, అయితే, ఆ ప్రభావం ఈ త్రైమాసికంలో కనిపించదని ఆ కంపెనీ సీఈఓ, ఎండీ ప్రియానాయర్ పేర్కొన్నారు.
త్రైమాసిక ఫలితాల సందర్భంగా తమ షేర్ హోల్డర్లకు శుభవార్త చెప్పింది హెచ్‌యూఎల్ కంపెనీ. మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ. 19 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపారు. ఇందుకు నవంబర్ 7వ తేదీన రికార్డ్ తేదీని ప్రకటించింది. నవంబర్ 20వ తేదీన ఈ డివిడెండ్ డబ్బులు చెల్లించనున్నట్లు పేర్కొంది. డివిడెండ్ కింద మొత్తం 11 లక్షల మంది వాటాదారులకు రూ. 4,464 కోట్లు చెల్లిస్తామని పేర్కొంది. త్రైమాసిక ఫలితాల క్రమంలో బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేర్లు 1.20 శాతం మేర లాభపడి రూ. 2,623 వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 2750 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 2136 వద్ద ఉంది. అలాగే డివిడెండ్ యీల్డ్ 1.65 శాతం, పీఈ రేషియో 56.59 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 6.12 లక్షల కోట్ల వద్ద ఉంది. ఫలితాల నేపథ్యంలో ఈ స్టాక్ లాభాల్లో కొనసాగుతోంది.