Site icon HashtagU Telugu

Heritage Foods: 117 శాతం పెరిగిన హెరిటేజ్ ఫుడ్స్‌ లాభం..

Heritage Foods Profits

Heritage Foods Profits

Heritage Foods: భారతదేశంలోని ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ జులై-సెప్టెంబర్ 2024 త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో లాభం రెండింతలు పెరిగింది, ఇది విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం. ఇది వరుసగా ఏడో త్రైమాసికంలో ఆదాయ వృద్ధిని చాటుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, లాభాదాయాలు కూడా పెరిగినట్లు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో, కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ. 48.63 కోట్లుగా నమోదైంది, ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఉన్న రూ. 22.4 కోట్లతో పోలిస్తే 117% పెరుగుదలగా ఉంది.

సమీక్షా త్రైమాసికంలో, సంస్థ కార్యకలాపాల ఆదాయం 4% పెరిగి రూ. 1019.5 కోట్లకు చేరింది. మొత్తం ఖర్చులు మాత్రం స్థిరంగా ఉన్నాయని, గతంలో ఇది రూ. 978.5 కోట్లుగా ఉంది. ఏడాది కిందట ఎర్నింగ్స్ పర్ షేర్ (EPS) రూ. 2.42 కాగా, ఇప్పుడు ఇది రూ. 5.24 కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలలకు, కంపెనీ ఆదాయం రూ. 2052.2 కోట్లు, నికర లాభం రూ. 107.10 కోట్లుగా నమోదైంది. ఈ సమయంలో ఎపీఎస్ రూ. 11.54 గా ఉంది.

జులై-సెప్టెంబర్ క్వార్టర్‌లో పాల సేకరణ 11.46% పెరిగిందని, పాల అమ్మకాలు 5.11% వృద్ధి చెందాయని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి వెల్లడించారు. విలువ ఆధారిత ఉత్పత్తుల అమ్మకాలు 15.5% పెరిగినట్లు కూడా పేర్కొన్నారు. పలు వ్యాపార విభాగాల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఎక్కువ లాభాలు సాధించగలిగామని ఆమె తెలిపారు. విలువ ఆధారిత ఉత్పత్తుల అమ్మకాలు పెరగడానికి మార్కెటింగ్ కార్యకలాపాలను పెంచడం, అలాగే విభిన్న ఉత్పత్తులను ఆవిష్కరించడం కూడా మంచి ఫలితాలు ఇచ్చాయని నారా బ్రాహ్మణి తెలిపారు.

ఫలితాలు జోష్ ఇచ్చినా, హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ మాత్రం పతనమవుతోంది. గత 3 రోజులుగా ఇది నష్టాల్లోనే ఉండగా, ఈ క్రమంలో 12% వరకు నష్టాలను చవిచూసింది, ఫలితాల తర్వాత కూడా ఈ రోజు స్టాక్ 5% క్షీణించింది. ఈ రోజు షేరు రూ. 565.10కి పడిపోయింది, కాగా 3 రోజుల క్రితం స్టాక్ రూ. 650 లెవెల్స్‌ను దాటి ట్రేడయింది. ఇంతలో మళ్లీ నష్టాలు వెంటాడుతున్నాయి.

ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ. 5.24 వేల కోట్లుగా ఉంది. హెరిటేజ్ కంపెనీ ఫౌండర్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి మరియు కోడలు కీలక పదవుల్లో ఉన్నారు. వీరి కుటుంబానికి ఈ కంపెనీలో పెద్ద మొత్తంలో షేర్లు ఉన్నాయి.