Renault Cars : పండగల సీజన్ ముంచుకొస్తున్న వేళ, కొత్త కారును కొనాలని భావించే వినియోగదారులకు రెనో ఇండియా ఒక శుభవార్త చెప్పింది. జీఎస్టీ 2.0 అమలుతో తలెత్తిన పన్ను ప్రయోజనాలను పూర్తిగా కస్టమర్లకు అందించాలనే లక్ష్యంతో, రెనో తమ కార్ల ధరలను గణనీయంగా తగ్గించింది. దీంతో రెనో క్విడ్, ట్రైబర్, కైగర్ మోడళ్ల ధరలు గరిష్ఠంగా రూ. 96,395 వరకు తగ్గినట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకూ ఉన్న పన్నుల భారం కింద కార్ల ధరలు సాధారణ వినియోగదారుడికి కొంత మేరకు భారంగా ఉండేవి. అయితే, తాజాగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 విధానంతో చిన్న కార్లపై పన్ను రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించబడింది. అంతేగాకుండా, మునుపటి విధానంలో వసూలు చేస్తున్న అదనపు సెస్లు కూడా తొలగించడంతో, కంపెనీలకు వచ్చిన ఆ లాభాన్ని వారు కస్టమర్లకు బదిలీ చేస్తున్నారు.
రెనో కారు మోడళ్లకు తగ్గిన ధరలు ఇవే
. రెనో క్విడ్ యొక్క తాజా ప్రారంభ ధర రూ. 4,29,900 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
. రెనో ట్రైబర్ మోడల్ రూ. 5,76,300 నుంచి ప్రారంభమవుతుంది.
. రెనో కైగర్ కూడా అదే ప్రారంభ ధరతో అందుబాటులోకి వస్తుంది.
రెనో ఇండియా స్పందన
ఈ సందర్భంగా రెనో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లె మాట్లాడుతూ..జీఎస్టీ 2.0 వల్ల మాకు వచ్చిన ప్రయోజనాన్ని కస్టమర్లకు పూర్తిగా అందించడమే మా ప్రాధాన్యం. పండగ కాలంలో వినియోగదారులు మాకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం అని తెలిపారు. అలాగే, వినియోగదారులకు మరింత విలువైన అనుభవం కల్పించే దిశగా రెనో ముందడుగు వేస్తోందని ఆయన చెప్పారు. మార్కెట్లో మిగతా ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఇతర కంపెనీల స్పందన
రెనో ఒక్కదాని వరకు ఆగలేదు. ఇప్పటికే టాటా మోటార్స్ కూడా జీఎస్టీ 2.0 ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు ధరలను తగ్గించింది. కాగా, ఈ తగ్గింపు ధరలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి డెలివరీలకు వర్తించనున్నాయి. అయితే, వినియోగదారులు తాజా ధరలతో తక్షణమే బుకింగ్ చేసుకోవచ్చు, అన్ని రెనో డీలర్‌షిప్‌లలో ఈ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
. టాటా టియాగో ధరలో గరిష్ఠంగా రూ. 75,000 తగ్గింపు వచ్చింది.
. టాటా నెక్సాన్ ధరలో రూ. 1,55,000 వరకు తగ్గింది.
ఇక, త్వరలో మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ఇతర ఆటోమొబైల్ దిగ్గజాలూ ఇదే దిశగా అడుగులు వేయనున్నట్టు సమాచారం. దీనివల్ల కార్ల మార్కెట్లో ఒక రేంజ్‌లో పోటీ నెలకొంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
జీఎస్టీ 2.0 వల్ల వస్తున్న మార్పులు
కొత్త జీఎస్టీ విధానం ప్రకారం, చిన్న కార్లపై పన్ను 18 శాతానికి పరిమితమైంది. ముందుగా ఈ విభాగానికి చెందిన కార్లపై 28 శాతం జీఎస్టీతో పాటు 1 నుంచి 22 శాతం వరకు సెస్లు ఉండేవి. ఇప్పుడు ఈ భారం తగిలి పోవడంతో, సంస్థలు కస్టమర్లకు ప్రత్యక్ష ప్రయోజనాలు అందించగలుగుతున్నాయి. ఇక, ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రభుత్వం ప్రోత్సాహం కొనసాగిస్తోంది. ఈ విభాగంపై జీఎస్టీ రేటు ఇప్పటికీ కేవలం 5 శాతంగానే ఉంది. ఈ పండగ సీజన్‌లో రెనో తీసుకున్న ఈ నిర్ణయం ఒక గొప్ప ఆఫర్‌గా చెప్పవచ్చు. వినియోగదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన కార్లు అందుబాటులోకి రావడంతో, డిమాండ్ మరింత పెరిగే అవకాశముంది. పైగా ఇతర బ్రాండ్లు కూడా ధరలు తగ్గించనున్న నేపథ్యంలో, ఇది కస్టమర్లకు డబుల్ బోనస్‌లా మారనుంది.