కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబర్ నెలలో వస్తు సేవల పన్ను జీఎస్టీకి సంబంధించి కీలక సంస్కరణలు చేసింది. కేవలం రెండు శ్లాబులో 5, 18 శాతం మాత్రమే ఉంచి 12, 28 శాతం పన్ను శ్లాబులను తొలగించింది. దీంతో చాలా రకాల వస్తువులు ధరలు భారీగా దిగివస్తాయని ప్రచారం జరిగింది. అయితే, కొన్ని చోట్ల అనుకున్న విధంగా ధరలు తగ్గలేదు. వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు చేరలేదు. అయితే, ప్రతి చోట జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గకపోవడానికి గల కారణాలను ఈ కథనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
చాలా రకాల వస్తువులపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను గత సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. జీఎస్టీ మండలి ఏదైనా వస్తువు లేదా సేవపై జీఎస్టీ రేటును తగ్గించినప్పుడు వినియోగదారులు ఆయా వస్తువుల ధరలు తగ్గాలని సహజంగా భావిస్తారు. సెక్షన్ 171లోని యాంటీ ప్రాఫిటీరింగ్ రూల్ ప్రకారం పన్ను ఏ మేరకు తగ్గుతుందో ఆ స్థాయిలో వినియోగదారులకు ప్రయోజనం అందించాలి. అయితే, వాస్తవంలో చాలా సందర్భాల్లో పన్ను తగ్గింపు ప్రయోజనం పూర్తిగా వినియోగదారులకు చేరడం లేదు.దీని వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తూ ప్రముఖ ఆర్థికవేత్తలు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తయారీ ఖర్చుల పెరుగుదల కారణంగా పన్ను రేటు తగ్గినా వస్తువులను తయారు చేయడానికి అయ్యే ముడి సరుకు ఖర్చులు, కార్మిక వ్యయాలు, ఇంధన ధరలు వంటి ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరిగితే కంపెనీలు ధరలు తగ్గించలేవు. ఇలా తయారీ వ్యయాల పెరుగుదలతో పన్ను తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు అందించలేరు.
అధిక లాభాల లక్ష్యం మరో కారణం. కొన్ని కంపెనీలు ముఖ్యంగా మార్కెట్‌లో బలమైన పట్టు ఉన్నవి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించకుండా ఆ తగ్గింపు మొత్తాన్ని తమ లాభాల మార్జిన్‌ను పెంచుకోవడానికి ఉపయోగిస్తాయి. పన్ను తగ్గినా, ధరను పాత స్థాయిలోనే ఉంచుతాయి.
ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ సమస్యలు కూడా మరో కారణంగా చెప్పవచ్చు. కొన్నిసార్లు జీఎస్టీ రేటు తగ్గించినప్పుడు కంపెనీలు తీసుకునే ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ మొత్తం తగ్గిపోవచ్చు. ఫలితంగా తయారీకి అయ్యే మొత్తం ఖర్చులో పెరుగుదల కనిపించవచ్చు. ఈ భారాన్ని కంపెనీలు తుది ఉత్పత్తి ధరపై వేస్తాయి. దీంతో ధరల తగ్గుదల పెద్దగా కనిపించదు.
కొన్ని వస్తువులపై జీఎస్టీ కోతలు కేవలం కొన్ని నిర్దిష్ట రకాల ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తుంటాయి. కానీ మొత్తం కేటగిరీకి వర్తించకపోవచ్చు. ఈ విధానపరమైన సంక్లిష్టత కారణంగా వ్యాపారులు మొత్తం ధరలను తగ్గించడానికి ఆసక్తి చూపరు. మరోవైపు మార్కెట్‌లో బలమైన పోటీ లేకపోతే ధరలను తగ్గించాల్సిన అవసరం కంపెనీలకు ఉండదు. పన్ను తగ్గింపు ప్రయోజనం కచ్చితంగా వినియోగదారులకు చేరాలంటే ఆ మార్కెట్‌లో ఆరోగ్యకరమైన, తీవ్రమైన పోటీ ఉండాలి.
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు చేరేలా చూసేందుకు నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ (NAA) వంటి సంస్థలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ దేశంలో వందల కోట్ల లావాదేవీల పర్యవేక్షణ ఈ సంస్థకు సవాలుగా మారింది. కేవలం పన్ను కోత మాత్రమే కాకుండా ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ పోటీ, వ్యాపారుల లాభాల ధోరణి వంటి అంశాలు తుది ధరలపై నిర్ణయాత్మక ప్రభావం చూపుతాయి. ఈ సమస్యలను పరిష్కరించగలిగితే జీఎస్టీ పన్ను తగ్గింపు ప్రయోజనాలను గరిష్ఠ స్థాయిలో వినియోగదారులకు చేరేలా చేయవచ్చని ఆర్థికవేత్తలను సూచిస్తున్నారు.
