8th Pay Commission: 8వ వేతన సంఘం అమలుకు ముందే కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని విభాగాల ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపి కబురు అందింది. పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, నాబార్డ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, పెన్షన్ల పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడానికి, ఫైనాన్షియల్ సెక్టార్‌లోని పెన్షనర్లకు సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఎంతమంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది?
ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సామాజిక భద్రత, ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక శ్రేయస్సు పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఈ నిర్ణయం చాటుతోంది. మొత్తం మీద ఈ నిర్ణయం వల్ల సుమారు 46,322 మంది ఉద్యోగులు, 23,570 మంది పెన్షనర్లు, 23,260 మంది ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.
PSGIC వేతన, పెన్షన్ మార్పులు
PSGIC ఉద్యోగుల వేతన మార్పులు 01.08.2022 నుండి అమలులోకి వస్తాయి. వేతన బిల్లులో మొత్తం 12.41% పెరుగుదల ఉంటుంది. ఇందులో ప్రస్తుత బేసిక్ పే, కరువు భత్యం (DA)లో 14% పెరుగుదల కలిసి ఉంటుంది. ఈ మార్పు వల్ల మొత్తం 43,247 మంది PSGIC ఉద్యోగులకు లాభం చేకూరుతుంది.
Also Read: కేంద్ర బడ్జెట్ 2026.. అంచనాలివే!
RBI పెన్షనర్లకు మరిన్ని ప్రయోజనాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ మార్పులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కొత్త మార్పుల ప్రకారం నవంబర్ 1, 2022 నుండి బేసిక్ పెన్షన్, డియర్నెస్ రిలీఫ్‌పై పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్‌లో 10% పెరుగుదల ఉంటుంది. దీనివల్ల రిటైర్డ్ వ్యక్తుల బేసిక్ పెన్షన్ 1.43 రెట్లు పెరుగుతుంది. ఫలితంగా వారి నెలవారీ పెన్షన్‌లో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. దీనివల్ల మొత్తం 30,769 మందికి (22,580 మంది పెన్షనర్లు, 8,189 మంది ఫ్యామిలీ పెన్షనర్లు) ప్రయోజనం కలుగుతుంది. దీని కోసం మొత్తం ఆర్థిక వ్యయం రూ. 2,696.82 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో బకాయిల కోసం రూ. 2,485.02 కోట్లు ఒకేసారి చేసే ఖర్చు కాగా రూ. 211.80 కోట్లు వార్షిక వ్యయం.
నాబార్డ్ సిబ్బంది వేతన, పెన్షన్ మార్పులు
నాబార్డ్ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన, పెన్షన్ పెంపునకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మార్పులు నవంబర్ 1, 2022 నుండి అమలులోకి వస్తాయి. దీనివల్ల నాబార్డ్‌లోని గ్రూప్ ‘A’, ‘B’, ‘C’ ఉద్యోగుల వేతన, అలవెన్సులలో సుమారు 20% పెరుగుదల ఉంటుంది.
నవంబర్ 1, 2017 కంటే ముందు రిటైర్ అయిన నాబార్డ్ ఉద్యోగుల బేసిక్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్‌ను ఇప్పుడు పూర్వపు RBI-నాబార్డ్ రిటైర్డ్ వ్యక్తులతో సమానం చేశారు. ఈ వేతన మార్పుల వల్ల వార్షికంగా రూ. 170 కోట్ల అదనపు భారం పడనుండగా, బకాయిల రూపంలో మొత్తం రూ. 510 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. పెన్షన్ మార్పుల వల్ల 269 మంది పెన్షనర్లు, 457 మంది ఫ్యామిలీ పెన్షనర్లకు ఒకేసారి రూ. 50.82 కోట్ల బకాయిలు, ప్రతి నెలా రూ. 3.55 కోట్ల అదనపు ఖర్చు అవుతుంది.
