ఐటీ దిగ్గజం అదిరిపోయే గుడ్‌న్యూస్..

IT Employees : భారత ఐటీ దిగ్గజ కంపెనీలు ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో ఉన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా లాభాదాయాలు పెద్దగా పుంజుకోవట్లేదు. అంతర్జాతీయంగా అనిశ్చితి సహా ఇప్పుడు కొత్త ఏఐ టూల్స్ ఈ రంగానికి ఇబ్బందికరంగా మారాయి. అయినప్పటికీ తాజాగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు శుభవార్త అందించింది. 100 శాతం వరకు ఉద్యోగులకు బోనస్ చెల్లింపులు చేయనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలు చూద్దాం. భారత ఐటీ రంగం కొంత కాలంగా తీవ్ర ఒడుదొడుకుల్ని […]

Published By: HashtagU Telugu Desk
Infosys

Infosys

IT Employees : భారత ఐటీ దిగ్గజ కంపెనీలు ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో ఉన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా లాభాదాయాలు పెద్దగా పుంజుకోవట్లేదు. అంతర్జాతీయంగా అనిశ్చితి సహా ఇప్పుడు కొత్త ఏఐ టూల్స్ ఈ రంగానికి ఇబ్బందికరంగా మారాయి. అయినప్పటికీ తాజాగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు శుభవార్త అందించింది. 100 శాతం వరకు ఉద్యోగులకు బోనస్ చెల్లింపులు చేయనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలు చూద్దాం.

భారత ఐటీ రంగం కొంత కాలంగా తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి బాధ్యతలు చేపట్టాక గతేడాది జనవరి నుంచి ఐటీ రంగం అనిశ్చితిలోనే ఉంది. ట్రంప్ తీసుకుంటున్న దూకుడైన కఠిన నిర్ణయాలు.. ఐటీ రంగంపై ఒత్తిడి పెంచాయి. ముందుగా భారత్ సహా పలు దేశాలపై దిగుమతి సుంకాల్ని పెంచడం.. ఇదే సమయంలో హెచ్1బీ వీసాల దరఖాస్తు ఫీజును భారీ స్థాయిలో పెంచడం వంటివి ప్రభావం చూపాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు కూడా ఐటీ రంగాన్ని అనిశ్చితిలోకి నెట్టేశాయి. దీంతో ఆర్డర్లు దక్కడం.. లాభాలు పడిపోవడం వంటివి జరుగుతూ వచ్చాయి. దీనికి తోడు ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ పెద్ద దెబ్బ కొట్టింది. ఒకవైపు ఏఐ వినియోగాన్ని పెంచేందుకు అటువైపు పెట్టుబడులు పెడుతూ.. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తగ్గిస్తుంటే.. ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న కొత్త కొత్త ఏఐ టూల్స్ పూర్తిగా ఐటీ రంగానికే ఇబ్బందికర పరిస్థితుల్ని తెస్తోంది.

ఆంథ్రోపిక్ ఏఐ సంస్థ ఇటీవల విడుదల చేసిన కొత్త ఏఐ టూల్స్.. ఐటీ/సాఫ్ట్‌వేర్ నిపుణుల అవసరాన్ని తగ్గించేలా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది కొత్త భయాల్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ఐటీ స్టాక్స్‌ దీని కారణంగా కుప్పకూలుతున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు ఒకవైపు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. తమ ఉద్యోగం ఎప్పటి వరకు ఉంటుందో.. ఎప్పుడు పోతుందోనని కంగారు పడుతున్నారు.

అయినప్పటికీ పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ భారత రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. శుభవార్త అందించింది. ఇటీవల మూడో త్రైమాసికంలో సంస్థ లాభాలు తగ్గినా.. ఏఐ టూల్స్ భయపెడుతున్నా.. ఉద్యోగులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి మెరుగైన బోనస్ ప్రకటించింది. సగటున ఉద్యోగులకు 85 శాతం పెర్ఫామెన్స్ బేస్డ్ బోనస్ (వేరియబుల్ పే) అందించనున్నట్లు వెల్లడించింది. ఇది ఉద్యోగులకు కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పొచ్చు. గత మూడున్నర సంవత్సరాల్లో ఒక త్రైమాసికంలో ఇన్ఫీ అందించే అత్యధిక బోనస్ ఇదేనని గణాంకాలు చెబుతున్నాయి.

బోనస్ చెల్లింపులు ఫిబ్రవరి నెల జీతంతో పాటే ఉంటాయని.. ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో వివరాల్ని వెల్లడించింది. కొద్ది రోజుల్లో ఉద్యోగులు అంతా.. బోనస్ పే అవుట్స్ లెటర్స్ అందుకుంటారని తెలిపింది. ఇక్కడ సగటున 85 శాతంగా ఉన్నప్పటికీ.. మిడ్ టు జూనియర్ లెవెల్ ఉద్యోగులకు కనీసం 75 శాతం నుంచి గరిష్ఠంగా 100 శాతం వరకు కూడా వేరియబుల్ పే చెల్లిస్తున్నట్లు పేర్కొంది. చాలా వరకు మాత్రం సగటున 85 శాతం అందుకోనున్నారు.

ఇటీవల ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా ఉద్యోగులు అందరికీ.. 2025 సంవత్సరానికిగానూ 100 శాతం బోనస్ చెల్లింపులు చేయనున్నట్లు వెల్లడించింది. అప్పట్లో కొవిడ్ సమయంలో ఇన్ఫీ.. 100 శాతం వరకు బోనస్ చెల్లింపులు చేయగా.. తర్వాత అనిశ్చితి, డిమాండ్ తగ్గడం నేపథ్యంలో వేరియబుల్ పే తగ్గిస్తూ వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రస్తుత అనిశ్చితి భయాలు ఉన్నప్పటికీ.. 100 శాతం వరకు వేరియబుల్ పే ఆఫర్ చేస్తుండటం ఐటీ రంగానికి కూడా కీలకంగా మారనుంది.

  Last Updated: 16 Feb 2026, 09:13 AM IST