Site icon HashtagU Telugu

New Gold Loan Rules : గోల్డ్ లోన్ తీసుకునే వారికీ శుభవార్త

Gold Loan

Gold Loan

బంగారం పై రుణాలు (Gold Loan) తీసుకునే వినియోగదారులకు ఎంతో ఉపశమనాన్ని కలిగించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా మార్గదర్శకాలు రూపొందించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు బంగారాన్ని తణఖా పెట్టుకొని ఇచ్చే రుణాల విషయంలో స్పష్టమైన నిబంధనలు లేకపోవడం వల్ల రుణగ్రహీతలు నష్టపోతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. అన్ని బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు (NBFCs) ఒకే విధమైన విధానాలను అనుసరించాల్సిందిగా ఆదేశించింది. రుణగ్రహీతలకు రక్షణ కల్పించడంతో పాటు, రుణదాతల రిస్క్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ మార్గదర్శకాలను రూపొందించింది.

Congress Vs Shashi Tharoor: శశిథరూర్‌పై వేటుకు కాంగ్రెస్ రెడీ అవుతోందా ?

కొత్త మార్గదర్శకాల ప్రకారం.. తణఖా పెట్టిన బంగారాన్ని బ్యాంకులు తమ బ్రాంచ్‌ల్లోనే భద్రంగా ఉంచాలి. మరొక బ్రాంచ్‌కు తరలించడం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అనుమతించాలి. బంగారు నిల్వ వ్యవస్థపై రెగ్యులర్ ఆడిట్లు జరపాలి. స్వచ్ఛత తనిఖీలు ముందస్తుగా సమాచారం ఇచ్చి చేయాలి. రుణం తిరిగి చెల్లించని పరిస్థితుల్లో బంగారం వేలం వేయవచ్చు. కానీ ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలి. కనీసం రెండు వార్తాపత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. రుణగ్రహీతకు, వారి వారసులకు నోటీసులు పంపాలి. వేలం ప్రారంభ ధర బంగారం విలువలో 90 శాతానికి తక్కువగా ఉండకూడదు. వేలంలో బ్యాంకు సిబ్బంది, వారి అనుబంధ సంస్థలు పాల్గొనకూడదు.

రుణం పూర్తిగా తీర్చిన తర్వాత తణఖా పెట్టిన బంగారాన్ని బ్యాంకులు ఏడువారానికి మించి ఆలస్యంగా ఇవ్వడంలేదంటే, రోజుకు రూ. 5,000 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. బంగారం పోతే లేదా పాడైతే, బ్యాంకులు పూర్తి బాధ్యత తీసుకోవాలి. మరమ్మతులు చేయాల్సిన ఖర్చులు కూడా భరించాలి. రుణం తీర్చిన తర్వాత రెండు సంవత్సరాల లోపు ఎవరూ క్లెయిమ్ చేయకపోతే, ఆ బంగారాన్ని “క్లెయిమ్ చేయని ఆస్తి”గా పరిగణిస్తారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ సమాచారాన్ని తమ బోర్డుకు నివేదించాలి. ఈ విధంగా RBI కొత్త నిబంధనలు రుణగ్రహీతలకు న్యాయం చేయడమే కాకుండా, రుణదాతల బాధ్యతను మరింత కట్టుదిట్టంగా చేసాయి.