రోజు రోజుకు గోల్డ్ ధరలు భారీగా పడిపోతున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక అనిశ్చితి వాతావరణం ఉండగా, మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల మార్పులు పసిడి మార్కెట్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సంవత్సరం 2025లో బంగారం ధరలు సుమారు 60 శాతం మేర పెరగడం బంగారం పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది. దేశాల మధ్య యుద్ధాలు, డాలర్ విలువ పెరుగుదల, చమురు ధరల్లో అస్తవ్యస్తత, ద్రవ్యోల్బణ భయం వంటి అంశాలు పసిడి ధరలు కొత్త రికార్డులు నమోదు చేయడానికి కారణమయ్యాయి. అయితే, దీపావళి పండుగ వరకు వేగంగా పెరిగిన గోల్డ్ రేట్లు ప్రస్తుతం కొంత స్థిరత్వం సాధిస్తున్నాయి. ముఖ్యంగా నవంబర్ ప్రారంభం నుంచి బంగారం ధరలు వరుసగా తగ్గుతుండటంతో వినియోగదారులు ఊపిరి పీలుస్తున్నారు.
Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బిగ్ షాక్!
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే, గత కొన్ని రోజులుగా పసిడి రేట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. క్రితం రోజు ఔన్సుకు 60 డాలర్లకు పైగా పడిపోయిన స్పాట్ గోల్డ్ ధరలు, ఈరోజు మళ్లీ 23 డాలర్ల మేర పెరిగి 3,974 డాలర్ల స్థాయికి చేరాయి. అలాగే స్పాట్ సిల్వర్ రేటు కూడా ఔన్సుకు 1.18 శాతం పెరిగి 48.11 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ మార్పులు గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా ఆర్థిక డేటా, చైనా వృద్ధి రేటు, యూరప్ ద్రవ్య విధానాలు వంటి అంశాలు రాబోయే వారాల్లో పసిడి ధరల దిశను నిర్ణయించనున్నాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.980 తగ్గి తులానికి రూ.1,21,480 వద్దకు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.900 తగ్గి రూ.1,11,350 వద్ద స్థిరపడింది. మరోవైపు వెండి ధర కూడా తగ్గుదల కొనసాగిస్తోంది. కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.1,63,000 వద్దకు చేరింది. ఇతర ప్రధాన నగరాలు అయిన ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతాల్లో వెండి రేటు కిలోకు సుమారు రూ.1,50,500 వద్ద ట్రేడవుతోంది. అయితే, ఈ ధరలు రోజువారీగా మారవచ్చు. పన్నులు, మేకింగ్ ఛార్జీలు ఆధారంగా మార్కెట్‌లో తేడాలు ఉండే అవకాశం ఉన్నందున, వినియోగదారులు బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్ రేట్లను తెలుసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
