Gold అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒకవైపు విపరీతంగా పెరుగుతున్నా.. అక్కడ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. రికార్డు స్థాయిలో గిరాకీ లభించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా రిపోర్టులో వెల్లడించింది. అంటే వినియోగం ఇంకా పెరిగిందని అర్థం. ఇదే సమయంలో భారత్‌లో మాత్రం 2024తో పోలిస్తే 2025లో పసిడి వినియోగం లేదా డిమాండ్ 11 శాతం తగ్గింది. అయితే ఇక్కడ దీని విలువ మాత్రం పెరిగింది.
భారతదేశంలో ఎప్పటినుంచో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇది మగువలకు ఎంతో ఇష్టమైన ఆభరణం. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుక ఏదైనా ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ఇది అంతలా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయిందని చెప్పొచ్చు. ఇంకా ఇటీవలి కాలంలో ధరలు పెరుగుతున్న క్రమంలో బంగారంపై విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు. బంగారంతో పాటే వెండికి కూడా డిమాండ్ ఇదే స్థాయిలో ఉంటుంది. అయితే 2025లో బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరగ్గా.. భారత్‌లో పసిడికి డిమాండ్ తగ్గింది. ఈ మేరకు ప్రపంచ స్వర్ణ మండలి (వరల్డ్ గోల్డ్ కౌన్సిల్- WGC) తన తాజా రిపోర్టులో వెల్లడించింది.
2024లో భారత్‌లో గోల్డ్ డిమాండ్ 802.8 టన్నులుగా ఉండగా.. ఇప్పుడు 2025లో 710.9 టన్నుల పసిడికి గిరాకీ ఏర్పడిందని తెలిపింది. ఇది ఏకంగా 11 శాతం తక్కువ. అంతకుముందుతో పోలిస్తే వినియోగం తగ్గిందన్నమాట. అయితే.. ఇక్కడ బంగారం ధర పెరిగిన నేపథ్యంలో దీని విలువ మాత్రం పెరిగింది. అంతకుముందు విలువ రూ. 5,75,930 కోట్లుగా ఉంటే.. సుమారు 30 శాతం మేర పెరిగి రూ. 7,51,490 కోట్లకు చేరుకుంది. అయితే.. ఈ ఏడాది అంటే 2026లో కూడా పసిడి డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండొచ్చని డబ్ల్యూజీసీ రిపోర్టులో తెలిపింది. దీనిని 600-700 టన్నుల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తోంది. వినియోగదారుల కొనుగోలు ధోరణి మారుతుండటమే కారణంగా పేర్కొంది. ఇది ఐదేళ్ల కనిష్ఠం అని తెలుస్తోంది.
2025 చివరి త్రైమాసికంలో అంటే అక్టోబర్- డిసెంబరులో పసిడి డిమాండ్ అంతకుముందు ఇదే సమయంతో పోలిస్తే 9 శాతం వరకు తగ్గి 241.3 టన్నులకు పరిమితమైందని డబ్ల్యూజీసీ తెలిపింది. ఈ సమయంలోనే బంగారం ధర అధికంగా పెరిగిన క్రమంలో విలువ ఏకంగా 49 శాతం పెరిగి రూ. 3,03,470 కోట్లకు చేరుకుంది. ఇక్కడ ఆభరణాలకు గిరాకీ కూడా 23 శాతం తగ్గి 145.3 టన్నులకు చేరింది. ఓవరాల్‌గా 2024లో గోల్డ్ జువెల్లరీ డిమాండ్ 563.4 టన్నులుగా ఉండగా.. 2025లో సుమారు 24 శాతం తగ్గి 430.5 టన్నులకు చేరుకుంది. విలువ మాత్రం పెరిగింది.
అయితే బంగారు ఆభరణాలకు డిమాండ్ తగ్గినా.. పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చారని డబ్ల్యూజీసీ రీజనల్ సీఈఓ సచిన్ జైన్ వెల్లడించారు. చివరి త్రైమాసికంలో బంగారంపై పెట్టుబడులు 26 శాతం పెరిగి 96 టన్నులకు చేరినట్లు తెలిపారు. పసిడి దిగుమతులు కూడా గతేడాది 17 శాతం తగ్గి 663.7 టన్నులకు పరిమితమయ్యాయి.
దేశీయంగా పసిడికి డిమాండ్ తగ్గినా.. అంతర్జాతీయంగా మాత్రం ఆల్ టైమ్ గరిష్ఠాలకు చేరుకుంది. 2025లో మొత్తం 5002 టన్నుల పసిడికి డిమాండ్ లభించిందని గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. 2024లో ఇది 4,961.9 టన్నులుగా ఉంది. ఇక్కడ ప్రధానంగా పెట్టుబడి గిరాకీ 1185.4 టన్నుల నుంచి 2,175.3 టన్నులకు పెరిగింది. ఈ పెట్టుబడుల్లో ఈటీఎఫ్, నాణేలు, పసిడి కడ్డీలు వంటివి ఉన్నాయి.
గోల్డ్ డిమాండ్ అంటే..
నిర్ణీత కాలంలో వినియోగదారులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వం కొనుగోలు చేసిన మొత్తం బంగారం పరిమాణం అని చెప్పొచ్చు. ఇందులో 4 రకాలు ఉంటాయి. ఒకటి ఆభరణాలు (ధరించే నగలు), పెట్టుబడులు (బిస్కెట్స్, కాయిన్స్, ఈటీఎఫ్ వంటివి), సెంట్రల్ బ్యాంకులు (ఆర్బీఐ నిల్వలు), సాంకేతిక రంగం (ఎలక్ట్రానిక్స్, ఇతర పరిశ్రమల్లో వాడే తక్కువ పరిమాణంలోని బంగారం) వంటివి ఉంటాయి. ఇక్కడ ఈ కాలంలో అన్ని రకాలుగా.. మొత్తం బంగారం వినియోగాన్ని గోల్డ్ డిమాండ్ అంటారు.
