Gold Price Prediction: సంవత్సరం ముగింపుకు వస్తోంది. కానీ బంగారు ధరలు మాత్రం తగ్గడం లేదు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1.40 లక్షల రూపాయలకు చేరుకుంది. ఈ సంవత్సరం బంగారం ధరల పరంగా చారిత్రాత్మకమైనదిగా నిలిచిపోనుంది. బంగారం ధరలు నిరంతరం కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే బంగారం ధరల్లో 70 శాతం కంటే ఎక్కువ పెరుగుదల కనిపించింది. ఏడాది ఆరంభంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 83,680గా ఉండగా ఇప్పుడు అది క్రమంగా లక్షన్నర రూపాయల దిశగా దూసుకుపోతోంది.
వచ్చే ఏడాది కూడా ధరలు పెరుగుతాయా?
2026లో కూడా ఇదే విధమైన పెరుగుదల కొనసాగుతుందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జేపి మోర్గాన్ (JP Morgan) విశ్లేషకుల ప్రకారం.. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 3,000 డాలర్ల నుండి 5,000 డాలర్ల (ప్రతి 10 గ్రాములకు సుమారు రూ. 1,58,485) వరకు వెళ్లే అవకాశం ఉంది. గోల్డ్‌మ్యాన్ సాక్స్ (Goldman Sachs) సర్వే ప్రకారం.. వచ్చే ఏడాది బంగారం ధరలు దాదాపు 36 శాతం పెరిగి 5,000 డాలర్ల మార్కును తాకవచ్చు. ప్రస్తుత ఎక్స్ఛేంజ్ రేటు ప్రకారం ఇది 10 గ్రాములకు సుమారు రూ. 1,58,213 అవుతుంది. ఈ అంచనాల్లో భారతదేశంలో విధించే 3 శాతం GST, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు కలపలేదు.
Also Read: దీపూ చంద్రదాస్ హత్య ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి
బంగారం ధర ఎందుకు పెరిగింది?
బంగారం ధరల్లో ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణం కావొచ్చు. గత మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎటువంటి పరిష్కారం లేకుండా కొనసాగుతోంది. వెనిజులా నుండి ముడి చమురు సరఫరాలో ఏర్పడే అడ్డంకులపై ఆందోళనలు నెలకొన్నాయి.
ఆఫ్రికాలో ISIS అనుబంధ గ్రూపులపై అమెరికా సైనిక చర్యల వార్తలు పెట్టుబడిదారులను టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. ఇటువంటి అనిశ్చితి నెలకొన్న సమయంలో పెట్టుబడిదారులు ఈక్విటీ వంటి రిస్క్ ఉన్న రంగాల నుండి డబ్బును ఉపసంహరించుకుని బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇతర కారణాలు
వడ్డీ రేట్ల తగ్గింపు: అమెరికా సెంట్రల్ బ్యాంక్ (US Fed) వచ్చే ఏడాది కనీసం రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించవచ్చని మార్కెట్ భావిస్తోంది. వడ్డీ రేట్లు తగ్గితే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్ల కంటే బంగారంపై పెట్టుబడి పెట్టడానికే ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తారు.
గోల్డ్ ETF: గోల్డ్ ETFలలో పెట్టుబడులు నిరంతరం పెరుగుతున్నాయి.
సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వల కోసం భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం.
