హైదరాబాద్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా గణనీయంగా తగ్గడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ రూ.1000 పైగా పెరుగుతూ సామాన్యులను కుదిపేసిన బంగారం ధరలు అక్టోబర్ 10న మాత్రం రూ.1,800 వరకు తగ్గాయి. నగరంలో స్వచ్ఛమైన బంగారం (24 క్యారెట్) 10 గ్రాముల ధర రూ.1,24,150 నుండి రూ.1,22,290కి తగ్గింది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ బంగారం ధర రూ.1,13,800 నుండి రూ.1,12,100కి చేరింది. తక్కువ శుద్ధి ఉన్న 18 క్యారెట్ బంగారం కూడా రూ.1,390 తగ్గి రూ.91,720కి చేరింది. అంటే బంగారం ధరలు ఒక్కరోజులోనే గణనీయంగా తగ్గడం వినియోగదారులకు ఉపశమనాన్ని కలిగించింది.
Jubilee Hills Bypoll : అంజన్ కుమార్ యాదవ్ ను బుజ్జగించే పనిలో కాంగ్రెస్
అయితే మరోవైపు వెండి ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. అక్టోబర్ 9న కిలో వెండి రూ.7,000 పెరిగితే, ఇవాళ మళ్లీ రూ.3,000 పెరిగి రూ.1,80,000కి చేరుకుంది. ఈ ధోరణి కొనసాగితే వెండి ధర మరో కొద్దికాలంలో రూ.2 లక్షల మార్క్‌ను దాటవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో కూడా ఈ ప్రభావం కనిపించింది . గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.25% పెరిగి రూ.1,20,796కి చేరగా, సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.07% పెరిగి రూ.1,46,428 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర $4,000 దాటిన తర్వాత స్వల్పంగా తగ్గి $3,970 వద్ద ఉండగా, ఔన్స్ వెండి ధర $49.57కు చేరి 50 డాలర్ల మార్క్ దాటేందుకు సిద్ధంగా ఉంది.
నిపుణుల అంచనాల ప్రకారం.. ఈ తగ్గుదల తాత్కాలికమే కావచ్చని, దీర్ఘకాలికంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గోల్డ్‌మన్ సాచ్స్ ఇటీవల ప్రకటించిన నివేదిక ప్రకారం 2026 డిసెంబరులో ఔన్స్ బంగారం ధర $4,900 వరకు చేరవచ్చని అంచనా. అంటే భారత కరెన్సీలో చూస్తే తులం బంగారం ధర రూ.1.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దీపావళి సీజన్, ధంతేరాస్, పెళ్లిళ్ల సీజన్ వంటి సందర్భాల్లో బంగారం కొనుగోళ్లు భారీగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు, వినియోగదారులు చిన్న మొత్తాల్లో ఇప్పటి నుంచే కొనుగోలు చేయడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

