Gold And Silver Prices Today : జనవరి నెల చివరలో కొంత తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు, ఫిబ్రవరి రెండో వారం నుండి మళ్ళీ పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా పసిడి ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరుగుతూ వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఫిబ్రవరి 25న హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర తులం (10 గ్రాములు)పై మరో రూ. 400 పెరిగి రూ. 1,48,300 వద్ద స్థిరపడింది. అంతకుముందు రోజు ఏకంగా రూ. 1900 పెరగడం గమనార్హం. ఇలా వరుసగా పెరుగుతూ కేవలం వారం వ్యవధిలోనే తులం బంగారంపై సుమారు రూ. 8,000 మేర భారం పడటం సామాన్యులకు మింగుడుపడని విషయంగా మారింది.
24 క్యారెట్ల బంగారం రికార్డు ధరలు
కేవలం ఆభరణాల బంగారమే కాకుండా, స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. నేడు రూ. 430 పెరగడంతో హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ. 1,61,780 కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు మరియు కేంద్ర బ్యాంకుల వద్ద పెరిగిన నిల్వలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. వరుసగా రూ. 2100, రూ. 1750 వంటి భారీ జంప్‌లు తీసుకోవడం చూస్తుంటే, పసిడి ధరలు త్వరలోనే మరిన్ని కొత్త గరిష్ఠాలను తాకేలా కనిపిస్తున్నాయి.
బంగారం ధరలు చుక్కలు చూపిస్తుంటే.. వెండి ధర మాత్రం కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చింది. అనూహ్యంగా ఒక్కరోజులోనే కేజీ వెండిపై రూ. 10,000 తగ్గడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 2.90 లక్షల వద్ద కొనసాగుతోంది. ఒకవైపు బంగారం పెరుగుతూ, మరోవైపు వెండి ధరలు క్రమంగా దిగి రావడం మార్కెట్‌లో విభిన్న పరిస్థితులను సృష్టిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ధరలు ఇంకా పెరుగుతాయేమో అన్న భయంతో కొందరు, మరికొంత కాలం వేచి చూద్దామని ఇంకొందరు సందిగ్ధంలో పడ్డారు.
