Gold- Silver Coins: నేటి డిజిటల్ కాలంలో జేబులో పర్సు పెట్టుకోవడం మరిచిపోయినా మొబైల్‌లో ఒక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు అన్ని పనులు అయిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇప్పటికీ బంగారం, వెండి నాణేలు పూర్తి గౌరవంతో చలామణిలో ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అవును ఇది రాజుల కాలం నాటి కథ కాదు 2026 నాటి వాస్తవం. డిజిటల్ గోల్డ్ యుగంలోనూ అసలైన లోహపు మెరుపును కాపాడుకుంటున్న ఆ దేశాల గురించి తెలుసుకుందాం.
అమెరికా- అమెరికన్ ఈగిల్ సందడి
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికాలో ‘అమెరికన్ ఈగిల్’ పేరుతో బంగారు, వెండి నాణేలు చట్టబద్ధమైన కరెన్సీగా గుర్తింపు పొందాయి. ఈ నాణేలపై $5, $10 లేదా $50 అని రాసి ఉంటుంది. అయితే వీటి అసలు విలువ లోహపు ధరను బట్టి వేల డాలర్లలో ఉంటుంది. ప్రజలు వీటిని కేవలం దాచుకోవడమే కాకుండా, ఆర్థిక సంక్షోభ సమయాల్లో అధికారిక కరెన్సీలా వాడుతుంటారు.
చైనా- పాండా కాయిన్స్ క్రేజ్
చైనాలో ‘గోల్డ్ పాండా’ నాణేలను అక్కడి సెంట్రల్ బ్యాంక్ విడుదల చేస్తుంది. ప్రతి సంవత్సరం ఈ నాణేలపై పాండా డిజైన్‌ను మారుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకు వీటిని అత్యంత విలువైనవిగా మారుస్తుంది. చైనాలో ఈ నాణేలను అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అక్కడ వీటిని చాలా దుకాణాల్లో లేదా బ్యాంకుల్లో సులభంగా నగదుగా మార్చుకోవచ్చు.
స్విట్జర్లాండ్- స్వచ్ఛతకు చిహ్నం
స్విట్జర్లాండ్‌ను ప్రపంచానికే ‘లాకర్’ అని పిలుస్తారు. ఇక్కడ ‘వ్రెనెలి’ అనే బంగారు నాణేలు చాలా ప్రాచుర్యం పొందాయి. స్విస్ ప్రజలు తమ పిల్లల పుట్టినరోజులకు లేదా ప్రత్యేక సందర్భాలలో కాగితపు నోట్లకు బదులుగా ఈ బంగారు నాణేలను ఇవ్వడానికి ఇష్టపడతారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో బంగారం అంతగా కలిసిపోయింది.
Also Read: Mumbai Airport : నూతన అధ్యాయానికి నాంది పలికిన ముంబై ఎయిర్పోర్ట్
కెనడా- మేపుల్ లీఫ్ మెరుపు
కెనడాకు చెందిన ‘మేపుల్ లీఫ్’ ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన బంగారు నాణేలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కెనడాలో ఇవి లీగల్ టెండర్. అంటే సాంకేతికంగా వీటితో మీరు బిల్లులు చెల్లించవచ్చు. అయితే, $2000 విలువైన బంగారు నాణేన్ని ఎవరూ కేవలం $50 విలువ కోసం ఖర్చు చేయరు కదా!
ఆస్ట్రియా- సంగీతం, బంగారం
ఐరోపాలోని ఈ చిన్న దేశంలో ‘ఫిల్హార్మోనిక్’ నాణేలు చలామణిలో ఉన్నాయి. ఇవి ఐరోపాలో అత్యధికంగా అమ్ముడయ్యే బంగారు నాణేలు. సంగీతంపై తమకున్న ప్రేమను ఆస్ట్రియా తన కరెన్సీలో ప్రతిబింబించింది.
