ప్రముఖ అగ్రి-బిజినెస్ సంస్థ గోద్రేజ్ ఆగ్రోవెట్, వరి సాగు చేసే రైతులకు తీపి కబురు అందిస్తూ ‘టకాయ్’ (TAKAI) అనే వినూత్న కీటక నాశినిని మార్కెట్లోకి విడుదల చేసింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ, తెగుళ్ల కారణంగా హెక్టారుకు సగటు దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ముఖ్యంగా కాండం తొలిచే పురుగు వల్ల 40% వరకు, ఆకు ముడత పురుగు వల్ల 30% వరకు దిగుబడి నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి గోద్రేజ్ ఆగ్రోవెట్, జపాన్‌కు చెందిన ISK సంస్థతో జతకట్టి ‘సైక్లాప్రిన్’ (CyclaprynTM) టెక్నాలజీని పరిచయం చేసింది. ఈ సరికొత్త ఫార్ములా పురుగులు ఆహారం తీసుకోకుండా తక్షణమే అడ్డుకోవడమే కాకుండా, పంటకు సుదీర్ఘ కాలం పాటు రక్షణ కవచంలా పనిచేస్తుంది.
వరి పంట ఎదుగుదల దశల్లో నాట్లు వేసిన 15-30 రోజుల మధ్య (వెజిటేటివ్ స్టేజ్) కాండం తొలిచే పురుగు దాడి చేస్తుంది. ఆ తర్వాత 40-60 రోజుల మధ్య (రీప్రొడక్టివ్ స్టేజ్) ఆకు ముడత పురుగు పంటను దెబ్బతీస్తుంది. ఈ రెండు కీలక దశల్లోనూ ‘టకాయ్’ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎకరాకు 160 మి.లీ మోతాదులో, పంట 15-30 రోజుల వయస్సులో ఉన్నప్పుడు ఒకసారి, తిరిగి 40-60 రోజుల దశలో మరోసారి వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మొక్క కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం దెబ్బతినకుండా, పంట ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడిని ఇస్తుంది.
గోద్రేజ్ ఆగ్రోవెట్ ఎండీ సునీల్ కటారియా మరియు సీఈఓ ఎన్.కె. రాజవేలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కీటక నాశిని కేవలం వరికే పరిమితం కాకుండా.. మొక్కజొన్న, మిరప, క్యాబేజీ, సోయాబీన్, శనగ మరియు చెరకు వంటి ఇతర వాణిజ్య పంటలలో కూడా వినియోగించేందుకు అనుమతుల ప్రక్రియలో ఉంది. గతంలో విడుదల చేసిన ‘అషితాక’ కలుపు నాశిని తరహాలోనే, ఈ ‘టకాయ్’ కూడా రైతులకు పెట్టుబడి ఖర్చులను తగ్గించి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తోడ్పడనుంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో తెగుళ్లను వేగంగా నియంత్రించడమే లక్ష్యంగా ఈ సరికొత్త ఆవిష్కరణ రూపుదిద్దుకుంది.
