Site icon HashtagU Telugu

First Pod Hotel: దేశంలోనే తొలి పాడ్ హోటల్.. ఏమిటిది ? ఎందుకు ?

First Pod Hotel New Delhi Metro Station Pod Hotel

First Pod Hotel: మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించే వారికి గుడ్ న్యూస్. దాదాపుగా మెట్రో రైళ్లు సకాలంలోనే వస్తుంటాయి. కానీ కొన్ని సార్లు మెట్రో రైళ్లు ఆలస్యం అవుతుంటాయి. అలాంటప్పుడు ప్రయాణికులు మెట్రో రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫామ్‌పైనే వేచి చూడాల్సి వస్తుంటుంది. ప్లాట్‌ఫామ్‌పై తగినన్ని సీట్లు లేక.. చాలామంది నిలబడాల్సి వస్తుంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. ఇలాంటి పరిస్థితి వస్తే ఇక మనం కూల్‌గా మెట్రో స్టేషన్‌లోని పాడ్ స్టేషన్‌‌లోకి వెళ్లిపోవచ్చు. అక్కడ కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల దాకా మనం రెస్ట్ తీసుకోవచ్చు. దీని కోసం కొంత ఛార్జీని చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఈ అద్భుత వసతి ఇంకా మన హైదరాబాద్ మెట్రోలో అందుబాటులోకి రాలేదు. దేశంలోనే తొలి పాడ్ హోటల్ న్యూఢిల్లీ రైల్వే మెట్రో స్టేషన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ మెట్రో స్టేషన్  మొదటి అంతస్తులో పాడ్ హోటల్‌ను నిర్మించారు.

Also Read :Jhukunga Nahin : ‘‘తగ్గేదేలే’’ అంటూ రాజ్యసభలో ఖర్గే హూంకారం.. ఎందుకంటే..

పాడ్ హోటల్‌లో ఏమేం ఉన్నాయి ? 

పాడ్‌ల ఆకారంలో చిన్నతరహా గదులతో ఉండటం వల్ల దీనికి పాడ్ హోటల్(First Pod Hotel) అని పేరొచ్చింది. ఒక గదిలో ఒకరే బస చేయొచ్చు. వీటిలో నిద్రపోవడానికి బెడ్ ఉంటుంది. కూర్చోవడానికి చైర్ ఉంటుంది. ల్యాప్ టాప్ పెట్టుకొని పనిచేసుకోవడానికి వర్క్ ప్లేస్ ఉంటుంది. వస్తువులను పెట్టుకోవడానికి చిన్న వార్డ్‌రోబ్ కూడా ఉంటుంది. విలాసవంతమైన లుక్‌లో ఈ  గదుల ఇంటీరియర్ ఉంటుంది.పడకలపై మందపాటి పరుపులు ఉంటాయి. ఈ గదులు తీసుకునే వారికి  క్లీన్ షీట్లు, దుప్పట్లు, దిండ్లు ఇస్తారు. గదిలో లైట్, ఫ్యాన్‌, ఏసీ,  ఇంటర్నెట్ వైఫై  సౌకర్యాలు ఉంటాయి. పాడ్ హోటల్‌లో పురుషులు, మహిళలకు వేర్వేరు వసతి గృహాలు ఉంటాయి. క్రికెట్ మ్యాచ్‌లు, సినిమాలు చూడటానికి ప్రొజెక్టర్ ఉంటుంది. లాంజ్ ప్రాంతంలో మినీ థియేటర్, పూల్ టేబుల్, ఫుట్‌బాల్ టేబుల్, వివిధ బోర్డ్ గేమ్‌ల సౌకర్యం ఉంటుంది.

పాడ్ హోటల్‌లో ఛార్జీలు

న్యూఢిల్లీ రైల్వే మెట్రో స్టేషన్‌లోని పాడ్ హోటల్‌‌‌లో రూ.400 చెల్లిస్తే 6 గంటలు గదిలో ఉండొచ్చు. రూ.600 చెల్లిస్తే రోజంతా గదిలో ఉండొచ్చు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీ పర్యటనకు వచ్చే ప్రజలకు ఈ సౌకర్యం బాగా ఉపయోగపడుతుంది. ఈ గదుల్లో ఉంటూ, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం వేచి చూడొచ్చు. విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంటే.. న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఎయిర్‌పోర్టు మెట్రో లైన్‌ను తీసుకోవచ్చు. ప్రస్తుతం పాడ్ హోటల్‌కు 180 మందికి వసతిని కల్పించే సామర్థ్యం ఉంది. ఈ ఏడాది జూన్ నాటికి 400 మందికి వసతిని కల్పించేలా గదులను పెంచనున్నారు. Booking.com, MakeMyTrip, Hostelworld, Agoda వంటి యాప్‌ల ద్వారా ఈ గదులను బుక్ చేసుకోవచ్చు.

Also Read :Anchor Pradeep: రాజకీయ నాయకురాలితో మ్యారేజ్.. యాంకర్ ప్రదీప్ రియాక్షన్