Fine For Late: ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITR) దాఖలు చేయడానికి చివరి రోజు సెప్టెంబర్ 15, 2025. ఈ గడువును కోల్పోయిన పన్ను చెల్లింపుదారులు జరిమానా (Fine For Late) చెల్లించాల్సి రావచ్చు. అలాగే రీఫండ్‌లో జాప్యం, ఆదాయపు పన్ను శాఖ నుండి తనిఖీలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే ITR దాఖలు గడువును జూలై 31 నుండి సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఇకపై గడువును పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది.
ఆదాయపు పన్ను రిటర్న్ అంటే ఏమిటి?
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) అనేది ఒక ఫారం. ఇందులో పన్ను చెల్లింపుదారులు తమ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఆదాయం, తగ్గింపులు, చెల్లించిన పన్నుల వివరాలను ప్రభుత్వానికి అందిస్తారు. ITR దాఖలు చేసిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ ఈ సమాచారం సరైనదేనా కాదా అని తనిఖీ చేస్తుంది. అలాగే పన్ను చెల్లింపుదారులు సరైన పన్ను మొత్తాన్ని చెల్లించారా లేదా అని కూడా పరిశీలిస్తుంది. ఏవైనా తప్పులు లేదా అక్రమాలు ఉన్నట్లు తేలితే, పన్ను ఎగవేతకు గాను చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
Also Read: Super Four Qualification: మరోసారి తలపడనున్న భారత్-పాక్.. ఎప్పుడంటే?
గడువును దాటవేస్తే పర్యవసానాలు ఏమిటి?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకారం.. పన్ను చెల్లింపుదారులు సెప్టెంబర్ 15న ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడంలో విఫలమైతే రూ. 5,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పన్ను బకాయిలు ఉన్నట్లయితే ప్రతి నెలా 1% వడ్డీ రేటుతో వడ్డీని కూడా చెల్లించాలి. దీంతోపాటు ఆదాయపు పన్ను రీఫండ్‌లు అందడంలో జాప్యం జరుగుతుంది. పన్ను ఎగవేత, సమాచారాన్ని దాచిపెట్టడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం వంటివి చేస్తే, చట్టపరమైన చర్యలు, శిక్ష లేదా జైలు శిక్ష కూడా పడవచ్చు.
ITR దాఖలు చేయడానికి 3 ఫారాలు
ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి మూడు రకాల ఫారాలు అందుబాటులో ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మూడు ఫారాలు లభిస్తాయి. పన్ను చెల్లింపుదారులు వారి జీతం, వ్యాపారం, లేదా పెట్టుబడుల నుండి వచ్చే లాభాల ఆధారంగా సరైన ఫారాన్ని ఎంచుకోవాలి.
- ఒక ఆస్తి, రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ITR-1 ఫారం.
- ఒకటి కంటే ఎక్కువ ఆస్తులు లేదా విదేశీ ఆదాయం ఉన్నవారికి ITR-2 ఫారం.
- వ్యాపారం, వాణిజ్య ఆస్తులు లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్నవారికి ITR-3 ఫారం.