Anil Ambani : రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం సమన్లు జారీ చేసింది. రూ.17,000 కోట్ల విలువైన బ్యాంకు రుణ మోసాలకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. విచారణ నిమిత్తం ఆయనను ఈడీ ప్రధాన కార్యాలయం, న్యూఢిల్లీలో ఆగస్టు 5న హాజరు కావాలని ఆదేశించింది. అధికారిక వర్గాల సమాచారం మేరకు, ఈడీ అధికారులు అనిల్ అంబానీ స్టేట్‌మెంట్‌ను పీఎంఎల్ఏ (Prevention of Money Laundering Act) చట్టం కింద నమోదు చేయనున్నారు. గత వారం మూడు రోజుల పాటు ముంబయిలోని అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో ఈడీ విస్తృతంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 35 ప్రాంగణాల్లో తణిఖీలు జరగగా, వీటిలో 50 కంపెనీలు, 25 మంది వ్యక్తుల సంబంధిత ఆస్తులు, కార్యాలయాలు ఉన్నాయి. ఈ తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: Jagan Tour : జగన్ పర్యటన అంటే భయపడుతున్న పార్టీ శ్రేణులు , ప్రజలు
ఈ కేసుకు కేంద్ర బిందువుగా మారింది రిలయన్స్ గ్రూప్‌కు సంబంధించిన పలు కంపెనీలు తీసుకున్న భారీ మొత్తంలోని బ్యాంకు రుణాల దారిమళ్లింపు ఆరోపణలు. 2017 నుంచి 2019 మధ్యకాలంలో యెస్ బ్యాంక్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు రూ.3,000 కోట్ల రుణాలను మంజూరు చేసింది. అయితే ఈ నిధులను కంపెనీలు అన్యకారణాలకోసం ఉపయోగించాయని, బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిపారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, ఈ రుణాల మంజూరులో యెస్ బ్యాంక్ అప్పటి ప్రమోటర్లకు లంచం ఇచ్చినట్లు కూడా ఈడీ విచారణలో వెల్లడి అయ్యింది. ఇదే సమయంలో, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ తీసుకున్న రూ.10,000 కోట్ల రుణాలను కూడా వ్యత్యాస దారులుగా మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) మరియు కెనరా బ్యాంక్‌ల మధ్య జరిగిన రూ.1,050 కోట్ల రుణ ఒప్పందంలోనూ అనేక అవకతవకలు జరిగినట్లు సమాచారం. ఈ ఒప్పందానికి సంబంధించి లావాదేవీలన్నీ ఈడీ ప్రత్యేకంగా పరిశీలిస్తోంది.
అంతేకాదు, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థ బ్యాంకులు జారీ చేసిన అడిషినల్ టైర్-1 (AT-1) బాండ్లలో దాదాపు రూ.2,850 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన ఈడీ, ఈ పెట్టుబడుల్లో క్విడ్ ప్రోకోకు పాల్పడిందనే అనుమానిస్తోంది. ఈ నిధులు సంబంధిత బ్యాంకుల ప్రమోటర్లతో లాభాపేక్ష ఆర్థిక ఒప్పందాల కింద పెట్టబడ్డాయని, అందుకే అవి కూడా విచారణలో భాగమవుతున్నాయి. ఈ సమగ్ర దర్యాప్తులో భాగంగా, అనిల్ అంబానీకి చెందిన సంస్థలు మొత్తం రూ.17,000 కోట్ల బ్యాంకు రుణాల మోసాలకు పాల్పడ్డాయనే ఆరోపణలపై ప్రస్తుతం ఈడీ తీవ్రంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ ప్రత్యక్షంగా విచారణకు హాజరయ్యే అవకాశం ఉండటంతో, ఈ కేసు మరో కీలక దశలోకి ప్రవేశించనుంది.
Read Also: US Pakistan Oil Deal Reality: అసలు పాక్‌లో ఆయిల్ ఉందా?