Jio Hotstar : తెర వెనుక ఏం జరిగిందో ఏమో.. ‘జియో హాట్‌స్టార్. కామ్’ డొమైన్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ప్రస్తుతం ఆ డొమైన్‌ను కలిగి ఉన్న దుబాయ్‌కు చెందిన భారతీయ అన్నాచెల్లెలు జైనమ్(13), జీవిక (10) సంచలన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘జియో హాట్‌స్టార్’ డొమైన్‌ను ఉచితంగానే ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఇచ్చేస్తామని వెల్లడించారు. ఆ డొమైన్ రిలయన్స్ చేతిలో ఉంటేనే పది మందికి మేలు జరుగుతుందని ఆ ఇద్దరు పిల్లలు వ్యాఖ్యానించడం గమనార్హం. సాయం చేసే ఉద్దేశంతోనే తాము ‘జియో హాట్‌స్టార్. కామ్’(Jio Hotstar) డొమైన్‌ను ఢిల్లీ యువకుడి నుంచి కొన్నామని జైనమ్, జీవిక స్పష్టం చేశారు. ఆ డొమైన్‌ను అమ్మేసి డబ్బులు సంపాదించాలనే దురుద్దేశం తమకు అస్సలు లేదని తేల్చి చెప్పారు. పూర్తిస్థాయి పేపర్ వర్క్‌తో తాము ‘జియో హాట్‌స్టార్. కామ్’ డొమైన్‌ను రిలయన్స్ చేతిలో పెట్టేందుకు సిద్ధమన్నారు.
ఎవరూ ఒత్తిడి చేయలేదు
ఈ నిర్ణయం తీసుకునేలా తమపై రిలయన్స్ కానీ.. ఇతరత్రా లీగల్ గ్రూపులు కానీ ఒత్తిడి చేయలేదని జైనమ్, జీవిక వెల్లడించారు. ఈ డొమైన్‌ను రిలయన్స్‌కు ఫ్రీగా ఇవ్వాలనేది తమ వ్యక్తిగత నిర్ణయమని.. స్నేహితులు, కుటుంబీకులు ఎవరూ తమపై ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. జియో హాట్ స్టార్ డొమైన్ కోసం భారీ ఆఫర్లతో తమకు చాలా ఈమెయిల్స్ అందాయని జైనమ్, జీవిక తెలిపారు. అయినా వాటిని తాము పట్టించుకోలేదన్నారు. ఫ్రీ ఆఫర్‌కు రిలయన్స్ సుముఖంగా ఉంటే తమను ఎప్పుడైనా సంప్రదించవచ్చని.. వారు స్పందించకున్నా పర్వాలేదని తేల్చి చెప్పారు.
Also Read :Ram Gopal Varma : చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిలపై కామెంట్స్.. రామ్‌గోపాల్ వర్మపై కేసు
తొలుత ‘జియో హాట్‌స్టార్. కామ్’ డొమైన్ ఢిల్లీకి చెందిన ఒక యాప్ డెవలపర్ వద్ద ఉండేది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను సంప్రదించిన ఆ యువకుడు తనకు రూ.కోటి ఇస్తేనే.. డొమైన్‌ను అప్పగిస్తానని డిమాండ్ చేశాడు. కానీ అందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అంగీకరించలేదు. ఈక్రమంలోనే దుబాయ్‌లో ఉంటున్న జైనమ్, జీవిక కుటుంబానికి చెందిన వారు ‘జియో హాట్‌స్టార్. కామ్’ డొమైన్‌ను ఢిల్లీ యువకుడి నుంచి కొనేశారు. వారే ఇప్పుడు జైనమ్, జీవికల ద్వారా తరుచుగా వీడియో సందేశాలను విడుదల చేయిస్తున్నారు.