Tesla Car : విద్యుత్ వాహనాల్లో గ్లోబల్ లీడర్‌గా పేరు గాంచిన టెస్లా కంపెనీ ఇటీవల భారత మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో టెస్లా సంస్థ తన తొలి వాహనాన్ని దేశంలో డెలివరీ చేసింది. ముంబయిలోని టెస్లా ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో, మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్‌నాయక్‌కు మొదటి టెస్లా కారును అందజేశారు. ఈ కారు మోడల్ వై (Tesla Model Y), తెలుపు రంగులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన తాళాలను సంస్థ ప్రతినిధులు స్వయంగా మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో మొట్టమొదటి టెస్లా వాహనాన్ని పొందడం నా జీవితంలో ఒక గౌరవకరమైన సందర్భం. పర్యావరణహిత, శక్తి సామర్థ్యం కలిగిన వాహనాలను ప్రోత్సహించేందుకు ఇది ఒక ముఖ్యమైన అడుగు.అని పేర్కొన్నారు.
టెస్లా సంస్థ స్థాపకుడు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ భారత మార్కెట్‌లో ప్రవేశించిన విషయం తెలిసిందే. జూలై 15న ముంబయిలో తమ తొలి షోరూంను ప్రారంభించింది. ఈ షోరూమ్ ద్వారా మోడల్ వై కార్ల విక్రయాలను ప్రారంభించింది. ఈ వాహనాలను పూర్తిగా చైనాలోని షాంఘై ప్లాంట్‌లో తయారు చేసి భారత్‌కు దిగుమతి చేస్తోంది. వీటిని కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) గా దేశంలోకి తెస్తున్నారు. మోడల్ వై కారును టెస్లా రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఒక్కటి రేర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ.59.89 లక్షలుగా ఉండగా, ఇది ఒక్క ఛార్జ్‌తో సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణించగలదు. రెండోది లాంగ్ రేంజ్ రేర్-వీల్ డ్రైవ్ వేరియంట్ దీని ప్రారంభ ధర రూ.67.89 లక్షలు, ఒక ఛార్జ్‌తో 622 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం కలదు. ఇప్పటికే ఈ కార్లపై దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తున్నట్టు తెలుస్తోంది. సంస్థ వివరాల ప్రకారం, ఇప్పటివరకు 600కు పైగా బుకింగ్‌లు నమోదైనట్లు సమాచారం.
మహారాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోందని, పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సర్‌నాయక్ తెలిపారు. విద్యుత్ వాహనాలపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలన్న ఉద్దేశంతోనే నేను ఈ కారును కొనుగోలు చేశాను అని చెప్పారు. ఇది కేవలం ఒక కారును కొనుగోలు చేసిన ఘటన మాత్రమే కాకుండా, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి ప్రారంభ సూచికగా మారింది. టెస్లా వాహనాలు భారత మార్కెట్లో అడుగుపెట్టడం వల్ల స్థానిక ఆటోమొబైల్ పరిశ్రమలో పోటీ కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఇంధన వినియోగాన్ని మించకుండా చూసేందుకు విద్యుత్ వాహనాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఇటువంటి వేళ టెస్లా వంటి ప్రపంచ స్థాయి కంపెనీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టడం, వినియోగదారులకు అధునాతన సాంకేతికతతో కూడిన ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తేనుంది. ఇది ఒకవైపు భవిష్యత్తు వాహనాలదిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తుండగా, మరోవైపు పర్యావరణ పరిరక్షణకు మద్దతు తెలిపే చర్యగా నిలుస్తోంది.
#WATCH | Mumbai, Maharashtra: Delivery of the first Tesla (Model Y) car from 'Tesla Experience Centre' at Bandra Kurla Complex, Mumbai, being made to the State's Transport Minister Pratap Sarnaik.
'Tesla Experience Center', the first in India, was inaugurated on July 15 this… pic.twitter.com/UyhUBCYygG
— ANI (@ANI) September 5, 2025