Deepinder Goyal: జొమాటో మాతృ సంస్థ ‘ఎటర్నల్’ గ్రూప్ సీఈఓ పదవికి దీపిందర్ గోయల్ రాజీనామా చేశారు. ఈ నిర్ణయానికి గల కారణాలను ఆయన స్వయంగా వాటాదారులకు రాసిన లేఖలో వివరించారు. అలాగే తన వారసుడి పేరును కూడా ప్రకటించారు.
దీపిందర్ గోయల్ రాజీనామాకు కారణం ఏమిటి?
కంపెనీ పరిధికి వెలుపల ఉండి కొన్ని కొత్త, రిస్క్‌తో కూడిన ఆలోచనలను అన్వేషించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు దీపిందర్ గోయల్ తెలిపారు. తన వారసుడిగా బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధీండా (అల్బీ) పేరును ప్రతిపాదించారు. అల్బీ ఇకపై ఎటర్నల్ గ్రూప్ కొత్త సీఈఓగా వ్యవహరిస్తారు.
వాటాదారులకు రాసిన లేఖలో ఏముంది?
తన దృష్టి ప్రస్తుతం ప్రయోగాత్మకమైన ఆలోచనల వైపు మళ్లిందని, అయితే అవి ఎటర్నల్ వంటి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ పరిధిలోకి రావని గోయల్ పేర్కొన్నారు. ఒకవేళ ఆ ఆలోచనలు కంపెనీ వ్యూహాలకు లోబడి ఉంటే, వాటిని కంపెనీ లోపలే కొనసాగించేవాడినని, కానీ అవి భిన్నమైనవని ఆయన స్పష్టం చేశారు. గోయల్ కంపెనీ నుండి పూర్తిగా తప్పుకోవడం లేదు. వాటాదారుల ఆమోదం పొందితే ఆయన బోర్డులో వైస్ చైర్మన్‌గా కొనసాగుతారు. కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాలు, సంస్కృతి, నాయకత్వ అభివృద్ధి, నైతిక విలువల విషయంలో తన భాగస్వామ్యం కొనసాగుతుందని ఆయన తెలిపారు.
Also Read: న్యూజిలాండ్‌తో తొలి టీ20.. విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ!
వాటాదారులకు రాసిన లేఖలోని ముఖ్యాంశాలు
“ప్రియమైన వాటాదారులకు ఈరోజు నేను గ్రూప్ సీఈఓ పదవి నుండి తప్పుకుంటున్నాను. అల్బిందర్ ధీండా (అల్బీ) ఎటర్నల్ కొత్త గ్రూప్ సీఈఓగా బాధ్యతలు చేపడతారు. ఇటీవల నా దృష్టి కొన్ని కొత్త ప్రయోగాలు, అన్వేషణల వైపు మళ్లింది. ఇవి చాలా రిస్క్ తో కూడుకున్నవి. వీటిని ఎటర్నల్ వంటి పబ్లిక్ కంపెనీ వెలుపల ఉండి కొనసాగించడమే సరైనది. ఎటర్నల్ తన ప్రస్తుత వ్యాపారంపై దృష్టి సారిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగాలి” అని పేర్కొన్నారు.
ఒక పబ్లిక్ కంపెనీ సీఈఓగా చట్టపరమైన బాధ్యతలు ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టాలని కోరుతాయి. ఈ మార్పు వల్ల ఎటర్నల్ తన లక్ష్యంపై పూర్తి ఫోకస్ పెట్టగలుగుతుంది. నేను నా జీవితంలో సగం కాలం (18 ఏళ్లు) ఈ కంపెనీని నిర్మించడానికే కేటాయించాను. నేను అల్బీ, అక్షంత్ లతో కలిసి ఎప్పటిలాగే పని చేస్తాను అని ముగించారు.
మార్పుతో కంపెనీ మరింత బలోపేతం
18 ఏళ్ల క్రితం మెనూ స్కానింగ్ కంపెనీగా మొదలైన సంస్థ నేడు బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని ఎవరూ ఊహించలేదని గోయల్ గుర్తు చేసుకున్నారు. ఈ నాయకత్వ మార్పు కంపెనీ వేగాన్ని తగ్గించదని, పైగా బలోపేతం చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం హోదా మాత్రమే మారుతోందని, కంపెనీ పట్ల తన నిబద్ధతలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
