‘కెనరా ఏఐ 1పే’ యూపీఐ యాప్‌ను విడుదల చేసిన కెనరా బ్యాంక్

‘కెనరా ఏఐ 1పే’ అనే పేరుతో ప్రారంభించిన ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) యాప్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడాన్ని ముఖ్య ఉద్దేశ్యంగా పెట్టుకుంది.

Published By: HashtagU Telugu Desk
Canara Bank launches UPI app 'Canara AI 1Pay'

Canara Bank launches UPI app 'Canara AI 1Pay'

. ఫాస్ట్ అండ్ సేఫ్‌గా డిజిటల్ లావాదేవీలు

. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న కొత్త యాప్

. హోమ్ స్క్రీన్ లోనే క్యూఆర్ కోడ్ స్కాన్

Canara Bank: డిజిటల్ లావాదేవీలను మరింత సులభం, సురక్షితం చేయాలనే లక్ష్యంతో కెనరా బ్యాంక్ ఏఐ ఫీచర్లతో కూడిన కొత్త మొబైల్ యాప్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘కెనరా ఏఐ 1పే’ అనే పేరుతో ప్రారంభించిన ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) యాప్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడాన్ని ముఖ్య ఉద్దేశ్యంగా పెట్టుకుంది. ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్‌తో పాటు యాపిల్ యాప్ స్టోర్‌లో కూడా డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంది. ఇప్పటికే ఇతర యూపీఐ యాప్‌లలో రిజిస్టర్ అయి ఉన్న కెనరా బ్యాంక్ ఖాతాదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కొత్త యాప్‌కు మారవచ్చు. వినియోగదారులు తమ కెనరా బ్యాంక్ ఖాతాతో పాటు ఇతర బ్యాంకుల ఖాతాలను కూడా ఈ యాప్‌కు లింక్ చేసుకునే సౌకర్యం ఉంది. దీంతో ఒకే యాప్ ద్వారా వేగవంతమైన, సురక్షితమైన డిజిటల్ చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది.

ఈ యాప్ వ్యక్తిగత వినియోగదారులకే కాకుండా వ్యాపారులు, చిన్న దుకాణదారులు, స్వయం ఉపాధి వ్యక్తులకు కూడా ఎంతో ఉపయోగకరంగా రూపొందించబడింది. చిన్న వ్యాపారాలు సులభంగా చెల్లింపులను స్వీకరించేందుకు, కస్టమర్లతో క్యాష్ అవసరం లేకుండా లావాదేవీలు నిర్వహించేందుకు ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషించనుంది. ఫీచర్ల పరంగా చూస్తే, ‘కెనరా ఏఐ 1పే’ యాప్‌లో ఆధునిక ఆర్థిక నిర్వహణ సాధనాలు ఉన్నాయి. వినియోగదారుల నెలవారీ ఖర్చుల విశ్లేషణ, కేటగిరీల వారీగా వ్యయ వివరాలు, ఆదాయం–ఖర్చుల ట్రెండ్స్ వంటి అంశాలను స్పష్టంగా చూపిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా అర్థం చేసుకొని ఖర్చులపై నియంత్రణ సాధించవచ్చు. హోమ్ స్క్రీన్ నుంచే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తక్షణమే చెల్లింపులు చేసే సౌకర్యం ఉంది. అంతేకాకుండా చిన్న మొత్తాల చెల్లింపులకు ప్రతిసారి యూపీఐ పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా రూపొందించారు.

ఇది రోజువారీ లావాదేవీలను మరింత వేగవంతం చేస్తుంది. బిల్లులు, సబ్‌స్క్రిప్షన్లు, ఈఎంఐలు, ఎస్ఐపీలు వంటి చెల్లింపులను ఆటోమెటిక్‌గా నిర్వహించే సదుపాయం కూడా ఈ యాప్‌లో ఉంది. భద్రత విషయంలో కెనరా బ్యాంక్ ఎలాంటి రాజీ పడలేదు. బయోమెట్రిక్ లాగిన్, డివైజ్ బైండింగ్ వంటి మల్టీ లెవెల్ సెక్యూరిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. రిజిస్టర్ చేసిన మొబైల్ డివైజ్ నుంచే లావాదేవీలు జరగేలా ఈ యాప్ పని చేస్తుంది. అదేవిధంగా అనుమానాస్పద లావాదేవీలను తక్షణమే గుర్తించి వినియోగదారులకు హెచ్చరికలు పంపించే సౌకర్యం ఉంది. ఏఐ ఆధారిత ఫీచర్లతో రూపొందించిన ‘కెనరా ఏఐ 1పే’ యాప్ డిజిటల్ చెల్లింపుల రంగంలో కొత్త అనుభూతిని అందించడమే కాకుండా, భారతదేశంలో క్యాష్‌లెస్ ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూర్చనుందని కెనరా బ్యాంక్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

 

 

 

  Last Updated: 24 Dec 2025, 07:29 PM IST