Tax Slabs : కేంద్ర బడ్జెట్‌లో(Budget 2024) భాగంగా పన్ను స్లాబ్‌లలో చేసిన మార్పుల వల్ల మధ్యతరగతి ప్రజలకు దాదాపు రూ.17,500 దాకా ఆదా అవుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఛైర్మన్ రవి అగర్వాల్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో సరైనదని పేర్కొన్నారు. దీనివల్ల మధ్యతరగతి వర్గాలకు చెందిన 65 శాతం మందికి ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. పాత పన్ను విధానంలో ఎక్కువ రేట్లు ఉండేవని.. కొత్త పన్ను విధానంలో వాటిని మార్చామన్నారు. కొత్త పన్ను విధానంలో తక్కువ పన్ను స్లాబ్‌ల పరిధిని రూ.3 లక్షల నుంచి రూ. 7 లక్షలకు, రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం లభిస్తుందని రవి అగర్వాల్ తెలిపారు. తాజాగా బుధవారం ఢిల్లీలో ఓ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
- ఈ బడ్జెట్‌లో ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచారు. దీంతో ప్రత్యక్ష పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం రూ.29,000 కోట్ల ఆదాయాన్ని వదులుకోవాల్సి వచ్చింది.
- ప్రస్తుత బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్‌ల్లో మార్పులు చేశారు. పాత పన్ను విధానంలోని రేట్లలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
- మనదేశంలో ఎక్కువ మంది వేతన జీవుల ఆదాయం రూ.3 లక్షల లోపే ఉంటుంది. అలాంటి వారికి పన్ను నుంచి మినహాయింపు లభించడం నిజంగా ఊరట కలిగించే అంశమని పరిశీలకులు అంటున్నారు. ఈ బడ్జెట్‌లో కొత్తపన్ను విధానం ప్రకటించిన మోడీ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులను తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేసిందని తెలిపారు.
- కొత్త ఆదాయపు పన్ను విధానంలో సవరించిన పన్ను స్లాబ్స్(Tax Slabs) 2024 ఏప్రిల్ 1 నుంచే (అసెస్‌మెంట్ ఇయర్ 2025-26) అమలులోకి వస్తాయి. పన్ను చెల్లింపుదారులు తమ నిర్దిష్ట ఆదాయం, డిడక్షన్స్, ఆర్థిక పరిస్థితి ఆధారంగా రెండు విధానాల్లో (కొత్త, పాత పన్ను విధానం) ఏదో ఒకదాన్ని ఎంచుకోవడం మంచిది.
- పాత పన్ను విధానాన్ని దశల వారీగా రద్దు చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు.
