Site icon HashtagU Telugu

BSNL Direct to Device : బీఎస్ఎన్ఎల్ ‘డైరెక్ట్ టు డివైజ్’ సర్వీసులు షురూ.. ఫైబర్‌ యూజర్లకు 500 లైవ్‌టీవీ ఛానళ్లు

BSNL Direct to Device Satellite Connectivity

BSNL Direct to Device : ‘డైరెక్ట్ టు డివైజ్’ శాటిలైట్ కనెక్టివిటీ సర్వీసును ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్‌ఎల్ బుధవారం ప్రారంభించింది. ఈవిషయాన్ని కేంద్ర టెలికాం శాఖ అధికారికంగా ప్రకటించింది. మన దేశంలోనే తొలి శాటిలైట్ టు డివైజ్ సర్వీసు(BSNL Direct to Device) ఇదేనని వెల్లడించింది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ ‘వయా శాట్’‌తో కలిసి ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ యూజర్లకు కూడా ఇంటర్నెట్ నెట్‌వర్క్ కనెక్టివిటీ లభించడం అనేది ఈ సర్వీసు ప్రత్యేకత అని చెప్పింది.

Also Read :Ajit Pawar : అజిత్ పవార్‌‌కు సుప్రీంకోర్టు మొట్టికాయలు.. శరద్ పవార్ ఫొటోలు వాడటంపై ఆగ్రహం

దీంతోపాటు ఫైబర్‌ టు హోమ్‌ (FTTH) యూజర్ల కోసం ఐఎఫ్‌టీవీ (IFTV) పేరిట కొత్త సేవలను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. తొలి విడతగా ఈ సేవలు తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కస్టమర్లకు అందుతాయని తెలిపింది. బీఎస్ఎన్‌ఎల్‌ లైవ్‌ టీవీ ఛానళ్లు డేటాతో సంబంధం లేకుండానే లభిస్తాయి. బఫర్‌ సమస్య లేకుండా హై స్ట్రీమింగ్‌ క్వాలిటీతో టీవీ ఛానళ్లను చూడొచ్చు. ఈ ఛానళ్లను ఎలాంటి ఎక్స్‌ట్రా మొత్తం చెల్లించకుండానే పొందొచ్చు. ప్రస్తుతానికి ఐఎఫ్‌టీవీ సేవలు ఆండ్రాయిడ్‌ టీవీల్లో మాత్రమే లభిస్తాయి. ఆండ్రాయిడ్‌ 10, ఆపై వర్షన్‌ వినియోగిస్తున్న  వారు బీఎస్‌ఎన్‌ఎల్‌ లైవ్‌టీవీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ ఛానళ్లు చూడొచ్చు. ఫైబర్‌ కస్టమర్లకు అపరిమిత డేటా లభిస్తుంది. త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ నెట్‌ఫ్లిక్స్‌, జీ5 వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు గేమ్స్‌ కూడా అందిస్తామని బీఎస్ఎన్‌ఎల్ వెల్లడించింది.

ఇటీవలే దేశవ్యాప్తంగా 7 కొత్త సేవలను బీఎస్ఎన్‌ఎల్ ప్రారంభించింది.ఆటోమేటెడ్‌ సిమ్‌ కియోస్క్‌లు, స్పామ్‌ డిటెక్షన్‌, వైఫై రోమింగ్‌, ఐఫ్‌టీవీ, రియల్‌టైం డిజాస్టర్‌ రెస్పాన్స్‌ సహా సెఫ్టీ ఫీచర్‌లతో సురక్షితమైన నెట్‌వర్క్, డైరెక్ట్‌ టూ డివైస్‌ సేవలు, ఈ ఆక్షన్‌ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే బీఎస్ఎన్‌ఎల్ జాతీయ Wi-Fi రోమింగ్ సేవలను ప్రారంభించనున్నారు. దీని ద్వారా ఇండియాలో ఎక్కడి నుంచి అయినా హై-స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్‌ను ఎంజాయ్ చేయొచ్చు.