Site icon HashtagU Telugu

Jio Mart : బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టా మార్ట్ లకు బిగ్ షాక్ ? రేసులోకి అంబానీ..!

Mukesh Ambani Jio Mart

Mukesh Ambani Jio Mart

కొంత కాలంగా క్విక్ కామర్స్ రంగం పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో జెప్టో, ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్ వంటివి రాణిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో మార్ట్ ప్రవేశించినా.. బలమైన మౌలిక వసతులతో దూసుకెళ్తోంది. 3 వేల రిటైల్ స్టోర్స్, 600 డార్క్ స్టోర్లతో ఒక్క త్రైమాసికంలోనే 5.8 మిలియన్ల (58 లక్షలు) కొత్త కస్టమర్లు యాడ్ అయ్యారు. మరి ఇప్పుడు.. జియోమార్ట్ దూకుడుతో ఈ క్విక్ కామర్స్ సంస్థలు తట్టుకుంటాయా?

ఇటీవలి కాలంలో జెప్టో, ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్ ఇలా పలు సంస్థలు.. 10 నిమిషాల డెలివరీ రంగంలో దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో క్విక్ కామర్స్ రంగం పుంజుకుంటోంది. ఈ మార్కెట్ కూడా వేగంగా వృద్ధి చెందుతోంది. ఇక ఇప్పుడు దీనిపై.. దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కన్ను పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌ కూడా తన సన్నాహాల్ని పూర్తి చేసింది. కొంతకాలంగా నెమ్మదిగా తన కార్యకలాపాల్ని ప్రారంభించిన జియో మార్ట్.. ఇప్పుడు వీటికి గట్టి పోటీ ఇస్తుంది. ఇప్పటివరకు ఉన్న తన పాత షెడ్యూల్డ్ డెలివరీ మోడల్‌ను మార్చేసి.. పోటీదారులకు దీటుగా 30 నిమిషాల్లోపు డెలివరీ చేసే క్విక్ కామర్స్ వ్యూహాన్ని అమలు చేస్తోంది.

భారతదేశ క్విక్ కామర్స్ మార్కెట్ విలువ 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 64 వేల కోట్లకు చేరుకుంది. ఇది 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా రూ. 2 లక్షల కోట్లకు చేరుతుందని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఇక్కడ రిలయన్స్ వాటా అధికంగా ఉంటుందని భావిస్తోంది.

రిలయన్స్ అనుసరిస్తున్న వ్యూహం ఇతర సంస్థల కంటే భిన్నమైనది. ఇప్పటికే తనకు ఉన్నటువంటి రిటైల్ బలాన్ని వాడుకుంటోంది. తన 3 వేలకుపైగా రిటైల్ స్టోర్స్ డెలివరీ హబ్స్‌గా పనిచేస్తున్నాయి. అదనంగా 600 డార్క్ స్టోర్స్ ప్రారంభించింది. 1000 నగరాల్లోని 5 వేల పిన్‌కోడ్స్‌కు డెలివరీ పరిధిని విస్తరించింది. ఉత్పత్తుల్లో.. నిత్యావసరాలు సహా ఎలక్ట్రానిక్స్, ఇతర ఫ్యాషన్ సెగ్మెంట్ వస్తువులు ఉన్నాయి.

ఇతర వాటితో పోలిస్తే జియోమార్ట్ కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ.. వృద్ధిలో మాత్రం ముందుంది. ఒకే త్రైమాసికంలో ఏకంగా 5.8 మిలియన్లు అంటే 58 లక్షల కొత్త కస్టమర్లు యాడ్ అయ్యారు. రోజువారీ ఆర్డర్లలో వార్షిక ప్రాతిపదికన చూస్తే 200 శాతం వృద్ధి కనిపిస్తోంది. త్రైమాసికం వారీగా చూస్తే ఇది 42 శాతంగా ఉంది. ఇక మొదట్లో డెలివరీ సమయం 60-90 నిమిషాల వరకు ఉండేది. ఇప్పుడు దీనిని 30 నిమిషాల కంటే తక్కువ సమయానికి చేర్చారు.

బ్లింకిట్, జెప్టో వంటివి.. ప్రధానంగా మెట్రో నగరాలపైనే దృష్టి సారించి.. మూలధనాన్ని ఖర్చు చేస్తుండగా.. రిలయన్స్ మాత్రం తన దృష్టిని వ్యూహాత్మకంగా టైర్- II, సెమీ అర్బన్ మార్కెట్లకు విస్తరిస్తోంది. చిన్న పట్టణాల్లో ఇప్పటికే రిలయన్స్‌కు తన స్టోర్ల ఉనికి ఉండటం, స్థానిక కొనుగోలు ప్రాధాన్యతల్ని అర్థం చేసుకోవడం వల్ల అక్కడి మార్కెట్‌ను త్వరగా చేజిక్కించుకోగల సత్తా ఉందని భావిస్తున్నారు. రిలయన్స్‌కు తన బలమైన మౌలిక సదుపాయాలు సహా విస్తృత ఉత్పత్తి శ్రేణి ఉండటం కలిసొచ్చే అంశంగా తెలుస్తోంది. దీంతో చిన్న పట్టణాల్లో.. ఇతర క్విక్ కామర్స్ సంస్థలు ఎంట్రీ ఇవ్వకముందే అక్కడి మార్కెట్‌ను కైవసం చేసుకోవాలని రిలయన్స్ భావిస్తున్నట్లు విశ్లేషకులు, బ్రోకరేజీ కంపెనీలు చెబుతున్నాయి. కస్టమర్ బేస్ కూడా వేగంగా పెరుగుతుండటం వల్ల.. రిలయన్స్ ఇదే దూకుడు కొనసాగిస్తే.. బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ వంటివి తట్టుకోలేవని అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version