Site icon HashtagU Telugu

SBI Chairman : మళ్లీ తెరపైకి బ్యాంకుల విలీనం.. ఇక ఈ బ్యాంకులు కనిపించవా?

Challa Sreenivasulu Setty

Challa Sreenivasulu Setty

మన దేశంలో కొంత కాలంగా బ్యాంకుల విలీనం వేగం పుంజుకుందని చెప్పొచ్చు. 2020లో మెగా బ్యాంకుల విలీనం జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు 10 బ్యాంకులు.. 4 పెద్ద బ్యాంకుల్లో కలిశాయి. తర్వాత రీజనల్ రూరల్ బ్యాంకులు కూడా విలీనం అవుతున్నాయి. ఇప్పుడు ఈ బ్యాంకుల విలీనానికి ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మద్దతు పలికారు.

ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై కొద్ది రోజులుగా విస్తృతంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.మరోసారి మెగా బ్యాంకుల విలీనం ఉంటుందని చర్చలు నడుస్తున్నాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీనిపై మాట్లాడారు. బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణ మంచిదేనని అన్నారు.అంతర్జాతీయ బ్యాంకులుగా ఎదగాలంటే పెద్ద బ్యాంకులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న బ్యాంకులతోనే ఇది సాధ్యం కాదని చెప్పారు. దీంతో మరోసారి విలీనం జరగక తప్పదని.. అప్పుడే పెద్ద బ్యాంకులుగా ఏర్పడే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు.దీంతో మరోసారి విలీనం ప్రక్రియ గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. 2020 లో అప్పుడు చిన్న ప్రభుత్వ బ్యాంకుల్ని పెద్ద బ్యాంకుల్లో విలీనం చేశారు. ఇప్పుడు మలివిడత విలీన ప్రక్రియకు కేంద్రం సిద్ధమైనట్లే తెలుస్తోంది. ఇప్పుడు 12 ప్రభుత్వ బ్యాంకుల్ని.. 8 కి పరిమితం చేసే యోచనలో ఉందని సమాచారం.

తాజాగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విలీనంపై అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. ఎస్బీఐ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. మరోసారి విలీనం జరిగితే మంచిదేనని అభిప్రాయపడ్డారు. అప్పటికి కూడా చిన్న బ్యాంకులు మనుగడలోనే ఉంటాయని ఒక ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎస్బీఐ ఇప్పటికే దిగ్గజ బ్యాంకుగా ఉన్నప్పటికీ.. మార్కెట్లో తన వాటాను మరింత పెంచుకునే విషయంలో రాజీ పడట్లేదని శెట్టి స్పష్టం చేశారు.

ప్రస్తుతం బ్యాంక్ మొత్తం ఆస్తుల విలువ రూ. 69 లక్షల కోట్లుగా ఉండగా.. తర్వాతి స్థానంలో HDFC బ్యాంక్ రూ. 40 లక్షల కోట్లతో ఉంది. అమెరికా టారిఫ్స్ నేపథ్యంలో.. భారతీయ ఎగుమతులపై ప్రభావం కనిపించినప్పటికీ.. ఎస్బీఐ మాత్రం తన రుణాల విషయంలో ఎలాంటి కోతలు విధించట్లేదని స్పష్టం చేశారు శెట్టి.

బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం సహా అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునేలా చేయడం కోసం కేంద్రం.. 2017 నుంచి విలీనాల్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య గతంలో 27 గా ఉండగా.. 12కు తగ్గాయి. 2020లోనే చూస్తే.. 10 చిన్న ప్రభుత్వ బ్యాంకులు 4 పెద్ద బ్యాంకులుగా మారాయి. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో కలిశాయి. సిండికేట్ బ్యాంకు.. కెనరా బ్యాంకులో విలీనమైంది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది. అలహాబాద్ బ్యాంకు.. ఇండియన్ బ్యాంకులో విలీనమైంది. దానికి ముందు 2017-19లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలిశాయి.

ఇప్పుడు విలీన పరిశీలనలో ఉన్న బ్యాంకుల విషయానికి వస్తే.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో.. బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనం చేసేందుకు ప్రతిపాదన సిద్ధమవుతోంది. ఇదే జరిగితే అప్పుడు ఎస్బీఐ తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో అతిపెద్ద బ్యాంకుగా మారుతుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి చిన్న బ్యాంకుల్ని ఎస్బీఐ లేదా పంజాబ్ నేషనల్ బ్యాంకు లేదా బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయొచ్చని తెలుస్తోంది. అప్పుడు కేవలం ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు వంటి పెద్ద బ్యాంకులే ఉండనున్నట్లు సమాచారం.

Exit mobile version