Site icon HashtagU Telugu

Youngest Billionaire: భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ ఇత‌నే.. సంపాద‌న ఎంతంటే?

Youngest Billionaire

Youngest Billionaire

Youngest Billionaire: భారతదేశానికి చెందిన అరవింద్ శ్రీనివాస్.. దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా (Youngest Billionaire) అవతరించారు. పర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన అరవింద్ శ్రీనివాస్ ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్, 2025లో అత్యంత ధనిక యువ భారతీయుడిగా తన స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితా ప్రకారం.. అరవింద్ నికర సంపద రూ. 21,190 కోట్లు. ఈ నివేదిక ప్రకారం.. ఆయన దేశంలోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా మారారు.

చిన్న వయసులోనే

అరవింద్ కంపెనీ పర్ప్లెక్సిటీ ఏఐ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అయిన గూగుల్ జెమిని (Gemini), ఓపెన్‌ఏఐ (OpenAI) చాట్‌జీపీటీ (ChatGPT)కి గట్టి పోటీని ఇస్తోంది. గతంలో అరవింద్ కంపెనీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. ఆయన గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను కొనుగోలు చేయడానికి 34.5 బిలియన్ డాలర్లు (భారతీయ రూపాయలలో దాదాపు రూ. 3 లక్షల కోట్లు) బిడ్ వేశారు. చెన్నై బాయ్‌గా పేరొందిన అరవింద్ చిన్న వయసులోనే టెక్ ప్రపంచంలో ఇంతటి విజయాన్ని సాధించి భారతదేశ కీర్తిని పెంచారు.

Also Read: West Indies: భారత బౌలర్ల ధాటికి విండీస్‌ 162 పరుగులకే ఆలౌట్‌!

అరవింద్ శ్రీనివాస్ ఎవరు?

అరవింద్ శ్రీనివాస్ జూన్ 7, 1994న చెన్నైలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచే చదువులో చాలా చురుకుగా ఉండేవారు. టెక్నాలజీ, గణితం, సైన్స్‌పై ఆయనకు మొదటి నుండి ఆసక్తి ఉండేది. ఆ తర్వాత ఆయనకు భారత ప్రభుత్వం నేషనల్ టాలెంట్ సెర్చ్ (NTS) స్కాలర్‌షిప్ లభించింది. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత అరవింద్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీ.టెక్, ఎం.టెక్ డిగ్రీలు పొందారు.

తదుపరి చదువు కోసం ఆయన అమెరికాకు వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బ‌ర్‌క్లీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈ సమయంలో అరవింద్ చేసిన అనేక పరిశోధనా పత్రాలు దేశీయ, విదేశీ ప్రసిద్ధ ఏఐ సదస్సులలో ప్రచురించబడ్డాయి. ఆయన మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పరిశోధన చేశారు. ఈ జ్ఞానం ఆయనకు పర్ప్లెక్సిటీ ఏఐ సహ-వ్యవస్థాపకుడిగా మారడంలో దోహదపడింది.

టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌తో భారీ డీల్

అరవింద్ పర్ప్లెక్సిటీ ఏఐ కంపెనీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఏఐ కంపెనీ దేశంలోని ప్రసిద్ధ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌తో ఒక పెద్ద డీల్‌ను కుదుర్చుకుంది. దీని ప్రకారం.. ఎయిర్‌టెల్ తన చందాదారులందరికీ పర్ప్లెక్సిటీ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ లక్షలాది మంది భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తోంది.

Exit mobile version