CJI – Stock Markets : స్టాక్ మార్కెట్లు రాకెట్ స్పీడుతో పరుగెడుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు ప్రస్తుతం హైరేంజులో కదలాడుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాక్ మార్కెట్లు పరిమితికి మించిన స్పీడుతో దూసుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో అలర్ట్‌గా ఉండాలని స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI), సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లకు ఆయన సూచించారు. ఈక్విటీ మార్కెట్లలో గణనీయమైన పెరుగుదలపై నిశిత పరిశీలన చేయాలన్నారు. ఇవాళ ముంబైలోని సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్ మాట్లాడారు.నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు చెందిన కొత్త వెబ్‌సైట్‌ను కూడా ఆయన(CJI – Stock Markets) ప్రారంభించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘స్టాక్ మార్కెట్ లావాదేవీలు బాగా పెరిగాయి. కొత్త నిబంధనలు కూడా చాలానే అమల్లోకి వచ్చాయి. ఈ తరుణంలో మరిన్ని సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ బెంచ్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశాన్ని సంబంధిత విభాగాలు పరిశీలించాలి ’’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ‘‘పెట్టుబడులకు చట్టపరమైన రక్షణ లభించాలి. వీటికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి సమర్థవంతమైన యంత్రాంగాలు ఉన్నాయని పెట్టుబడిదారులకు తెలియజేయాలి. వారికి భరోసారి కల్పించాలి. అలా అయితే మన దేశ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వస్తారు. ఈ పెట్టుబడుల ప్రవాహం వల్లే దేశంలో మూలధన నిర్మాణం జరుగుతుంది. ఉద్యోగ కల్పనకు, ఆర్థిక వికాసానికి తలుపులు తెరుచుకుంటాయి’’ అని ఆయన చెప్పారు.
Also Read :Alluri Sitarama Raju : నేడు అల్లూరి జయంతి.. తెలుగుజాతి గర్వించే ధీరుడు, శూరుడు
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సీజేఐ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ .. తాను న్యాయమూర్తిగా గత 24 ఏళ్ల వృత్తిజీవితంలో ఏ ప్రభుత్వం నుంచి కూడా రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కోలేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ సంప్రదాయాలను అనుసరించి వివాదాలను పరిష్కరించేలా భారత్‌లోని న్యాయమూర్తులు శిక్షణ పొందుతున్నారని ఆయన చెప్పారు. రాజ్యాంగపరమైన కేసుల విషయంలో రాజకీయాలపై తమ తీర్పుల ప్రభావం గురించి జడ్జీలు అవగాహన కలిగి ఉండాలన్నారు. అయితే ఈ అంశాన్ని తాను రాజకీయ ఒత్తిడిగా పరిగణించనని సీజేఐ తెలిపారు.