Reliance Intelligence : కృత్రిమ మేధ (Artificial Intelligence – AI) సాంకేతిక రంగంలో ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతోంది. గ్లోబల్ రంగంలో జరిగిన మార్పులు, వినియోగదారుల నైపుణ్యం, డేటా శక్తి అన్ని కలిసి ఏఐ వినియోగాన్ని విస్తృతం చేస్తున్నాయి. ఈ దిశగా భారత్ కూడా తనదైన గాధ రాయడానికి సిద్ధమవుతోంది. భారతదేశంలో ఈ ఏఐ విప్లవాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ మరో కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తరఫున, ఆయన ‘రిలయన్స్ ఇంటెలిజెన్స్’ అనే పేరుతో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంబానీ తాజా ప్రకటన రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశం (AGM) లో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..గత దశాబ్దంలో డిజిటల్ సేవలు రిలయన్స్‌కు కొత్త వృద్ధి ఇంజిన్‌లా మారాయి. ఇప్పుడు అదే విధంగా కృత్రిమ మేధ మన కొత్త ఆశాజ్యోతి. ప్రతి భారతీయుడికి ఏఐ సేవలు అందించాలన్నదే మా లక్ష్యం అని తెలిపారు.
గూగుల్, మెటా భాగస్వామ్యం
ఈ లక్ష్యాన్ని నిజం చేయడానికి రిలయన్స్, గూగుల్, మెటా సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంది. మొదటిదశగా రూ. 855 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ భాగస్వామ్యంలో క్లౌడ్ సాంకేతికత, డేటా సెంటర్లు, మరియు ఏఐ అప్లికేషన్‌ల అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఇది ఒక చారిత్రాత్మక దశ. మన ఏఐ మోడల్స్ ఇప్పుడు తాము తామే నేర్చుకుంటున్నాయి. సూపర్ ఇంటెలిజెన్స్‌కి ఇది ఆరంభం మాత్రమే. రిలయన్స్‌తో కలసి పని చేయడం ఆనందంగా ఉంది అన్నారు.
జామ్‌నగర్‌లో మొదటి అడుగు
ఈ వేదికపై అంబానీ మరో కీలక విషయాన్ని వెల్లడించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ ఆధారిత డేటా సెంటర్ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇది శక్తిసౌర ఉత్పత్తి ఆధారంగా ఏఐ సేవలను అందించనుంది. దేశవ్యాప్తంగా ఇలాంటి డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలనే ప్రణాళికతో ముందుకుసాగుతున్నట్టు తెలిపారు.
గూగుల్ మద్దతు, ఇండియన్ క్లౌడ్ గేట్‌వే
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ..భారత్‌లో ఏఐకి అపారమైన అవకాశాలున్నాయి. ఎనర్జీ, రిటైల్, టెలికాం, ఫైనాన్షియల్ సర్వీసుల రంగాల్లో దీని వినియోగం విస్తృతంగా ఉంటుంది. అందుకోసం జామ్‌నగర్‌లో ప్రత్యేక క్లౌడ్ రీజియన్‌ను ఏర్పాటు చేస్తున్నాం” అన్నారు.
భవిష్యత్ దిశ, ప్రతి ఒక్కరికీ ఏఐ అందుబాటులోకి
రిలయన్స్ ఇంటెలిజెన్స్ లక్ష్యం ఏకైకంగా ప్రతి భారతీయుడికి ఏఐను చేరువ చేయడం. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, వ్యాపారం వంటి విభాగాల్లో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఈ భాగస్వామ్యంతో భారత్ సాంకేతిక రంగంలో గ్లోబల్ స్థాయిలో తన స్థానం మరింత బలోపేతం చేసుకోనుందని నిపుణుల అభిప్రాయం.