Site icon HashtagU Telugu

Air India : శిక్షణ విమానాలకు ఎయిర్‌ ఇండియా ఆర్డర్‌

Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash

Air India: దేశీయ విమానయాన రంగంలో దిగ్గజం ఎయిర్‌ ఇండియా గురువారం 34 శిక్షణ విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. తాజా ఆర్డర్‌లో అమెరికా పైపర్‌ సంస్థకు చెందిన 31 సింగిల్‌ ఇంజిన్‌ విమానాలు, ఆస్ట్రియాకు చెందిన డైమండ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ సంస్థకు చెందిన 3 ట్విన్‌ ఇంజిన్‌ విమానాలు ఉన్నాయి. ఈ ఆర్డర్‌తో, దక్షిణాసియాలో అతిపెద్ద వైమానిక శిక్షణ కేంద్రాన్ని మహారాష్ట్రలోని అమరావతిలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. 2025 నాటికి ఈ విమానాల డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

2024 రెండో అర్ధభాగంలో నియంత్రణ సంస్థల అనుమతులు పొందిన తరువాత, ఈ కేంద్రం కార్యకలాపాలను ప్రారంభించాలని ఎయిర్‌ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. జెట్‌ ఏ1 ఇంధన ఇంజిన్‌లు, జీ1000 ఏవియానిక్స్, గ్లాస్‌కాక్‌పిట్‌ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ విమానాలను తయారు చేయనున్నారు. అమరావతిలోని బెలోరా ఎయిర్‌పోర్టు వద్ద ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం ద్వారా ఏటా 180 మంది కమర్షియల్‌ పైలట్లను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. సరికొత్త ఎఫ్‌టీవోను బెలోరా ఎయిర్‌పోర్టులోని 10 ఎకరాల్లో నిర్వహించనున్నారు.

”భారత వైమానిక రంగం స్వయం సమృద్ధిని సాధించడంలో ఎయిర్‌ ఇండియా చేపట్టిన ఈ కొత్త ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌టీవో) ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది ప్రభుత్వ ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలకు మద్దతుగా నిలుస్తుంది ” అని ఎయిర్‌ ఇండియా ఏవియేషన్‌ అకాడమీ డైరెక్టర్‌ సునీల్‌ భాస్కరన్‌ అన్నారు. డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, డిజిటైజ్డ్‌ ఆపరేషన్‌ సెంటర్‌, ఆన్‌సైట్‌ మెయింటెనెన్స్‌ ఫెసిలిటీలతో పాటు హాస్టల్‌ వంటి ప్రపంచస్థాయి ప్రమాణాలను పాటిస్తామని ఎయిర్‌ ఇండియా వెల్లడించింది. ఇప్పటికే ఎయిర్‌ ఇండియా గురుగ్రామ్‌లో ఏవియేషన్‌ ట్రైనింగ్‌ అకాడమీని ప్రారంభించింది.

Read Also: India vs Pak : ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లకు న్యూట్రల్ వేదికలు – ICC నిర్ణయం

 

 

 

Exit mobile version