గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అదానీ విల్మర్ లిమిటెడ్‌లోని తమ మిగతా వాటా 7 శాతం మొత్తాన్ని కూడా విక్రయించింది. బ్లాక్ డీల్ ద్వారా దీనిని విక్రయించినట్లు తెలుస్తుండగా.. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్వర్ల నుంచి విపరీతంగా డిమాండ్ వచ్చింది. పెద్ద పెద్ద కంపెనీలే ఇందులో పాల్గొన్నట్లు సమాచారం.
దిగ్గజ పారిశ్రామిక వేత్త, భారత్‌లో రెండో అత్యంత ధనవంతుడు గౌతమ్ అదానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన అధినేతగా ఉన్న అదానీ గ్రూప్.. ఇప్పుడు అదానీ విల్మర్ లిమిటెడ్ నుంచి పూర్తిగా బయటికి వచ్చేసింది. ఇందులో 7 శాతం వరకు వాటా ఉండగా.. ఈ పూర్తి మొత్తాన్ని ఇప్పుడు విక్రయించింది. బ్లాక్ డీల్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అదానీ విల్మర్ లిమిటెడ్‌లో తన వాటా విక్రయానికి.. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (సంస్థాగత మదుపరులు) నుంచి ఫుల్ డిమాండ్ లభించింది. ఇందులో చాలా పెద్ద పెద్ద కంపెనీలే ఈ బ్లాక్ డీల్‌లో పాల్గొన్నట్లు తెలిసింది.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్, క్వాంట్ మ్యూచువల్ ఫండ్, చార్లెస్ స్కావాబ్, వ్యాన్‌గార్డ్ ఇలా ఎన్నో దేశీయ మ్యూచువల్ ఫండ్ సంస్థలు వాటా విక్రయంలో పాల్గొన్నట్లు సమాచారం. ఇంకా.. భారత్‌లోనే కాకుండా యూఏఈ, సింగపూర్, ఆసియాకు చెందిన ఇతర మార్కెట్ల నుంచి కూడా పలువురు అంతర్జాతీయ మదుపరులు అదానీ విల్మర్ లిమిటెడ్‌లో వాటాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
బయటి సంస్థలే కాకుండా అదానీ విల్మర్ లాంగ్ టర్మ్ ఇన్‌స్టిట్యూషనల్ పార్ట్‌నర్ జీఐసీ కూడా తన వాటాను పెంచుకోనుందని సమాచారం. అంతకుముందు ఈ వారం ప్రారంభంలో.. అదానీ విల్మర్ లిమిటెడ్‌లో 13 శాతం వాటాను అమ్మేసింది. దీంతో 7 శాతం వాటా మిగలగా.. తాజాగా దానిని కూడా విక్రయించేసిందన్నమాట. ఈ క్రమంలోనే శుక్రవారం సెషన్‌లో అదానీ విల్మర్ షేర్ ధర ఒక శాతానికిపైగా తగ్గి రూ. 273.60 వద్ద స్థిరపడింది. ఒక దశలో ఇంట్రాడేలో 4 శాతానికిపైగా పడిపోయింది.
విల్మర్ లిమిటెడ్, అదానీ గ్రూప్ రెండూ కలిసి జాయింట్ వెంచర్ అదానీ విల్మర్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. తర్వాత దీనిని అదానీ విల్మర్ లిమిటెడ్ అగ్రి బిజినెస్‌గా మారింది. ఇది ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ రంగంలో కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది. బియ్యం, చక్కెర, సబ్బులు, ఆహార నూనెలు, గోధుమ పిండి వంటి నిత్యవసర వస్తువుల్ని తయారు చేసి విక్రయిస్తుంది. అంతకుముందు ఇందులో 44 శాతం వాటాతో.. అదానీ గ్రూప్ మెజార్టీ షేర్ హోల్డర్‌గా ఉండగా.. ఇప్పుడు పూర్తిగా బయటికి వచ్చేసింది. వాటా విక్రయం ద్వారా అదానీ గ్రూప్‌కు సుమారు రూ. 15 వేల కోట్లకుపైగా వచ్చినట్లు తెలిసింది. దీంతో విల్మర్ ఇంటర్నేషనల్ ఏకైక ప్రమోటర్‌గా 57 శాతం వాటాతో మేజర్ షేర్ హోల్డర్‌గా ఉంది.
