హెచ్‌-1బీ వీసా జాప్యం..భారత ఉద్యోగులకు అమెజాన్‌ తాత్కాలిక ఊరట

సాధారణంగా అమల్లో ఉన్న ఐదు రోజుల ఆఫీసు హాజరు నిబంధనను సడలించి, వచ్చే మార్చి వరకు ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ వెసులుబాటు కొన్ని స్పష్టమైన షరతులతోనే ఉంటుందని సంస్థ తెలియజేసింది.

Published By: HashtagU Telugu Desk
H-1B visa delays: Amazon offers temporary relief to Indian employees

H-1B visa delays: Amazon offers temporary relief to Indian employees

. వీసా అపాయింట్‌మెంట్‌ ఆలస్యం… ఉద్యోగులకు ఇబ్బందులు

. మార్చి 2 వరకు వర్క్‌ ఫ్రం హోమ్‌కు అనుమతి

. టెక్‌ దిగ్గజాలకూ ఇదే సమస్య

Amazon: అమెరికాలో పని చేసే హెచ్‌-1బీ వీసా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వీసా అపాయింట్‌మెంట్‌లలో జరుగుతున్న జాప్యం కారణంగా భారత్‌లోనే ఉండిపోయిన తమ ఉద్యోగులకు అమెజాన్‌ తాత్కాలికంగా ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. సాధారణంగా అమల్లో ఉన్న ఐదు రోజుల ఆఫీసు హాజరు నిబంధనను సడలించి, వచ్చే మార్చి వరకు ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ వెసులుబాటు కొన్ని స్పష్టమైన షరతులతోనే ఉంటుందని సంస్థ తెలియజేసింది.

హెచ్‌-1బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న అమెజాన్‌ ఉద్యోగులు వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలతో ఇటీవల భారత్‌కు వచ్చారు. అయితే వీసా రీషెడ్యూల్‌ అపాయింట్‌మెంట్‌లు ఆలస్యం కావడంతో వారు తిరిగి అమెరికా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్‌ 13 నాటికి భారత్‌కు వచ్చిన పలువురు ఉద్యోగులు ఇంకా అపాయింట్‌మెంట్‌ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ అనిశ్చిత పరిస్థితి ఉద్యోగుల కెరీర్‌, ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో కంపెనీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాల్సి వచ్చింది.

H 1b Visa

ఈ నేపథ్యంలో అమెజాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వీసా అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఈ ఏడాది మార్చి 2 వరకు రిమోట్‌గా పని చేసుకునే అనుమతి ఇచ్చింది. ఈ విషయమై సంబంధిత ఉద్యోగులకు ప్రత్యేక అడ్వైజరీ పంపినట్లు సమాచారం. అయితే ఈ కాలంలో ఉద్యోగులు పూర్తిస్థాయి సాంకేతిక పనులు చేయరాదని స్పష్టంగా పేర్కొంది. కోడింగ్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌, కీలక వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం, కస్టమర్లతో నేరుగా మాట్లాడటం వంటి కార్యకలాపాలకు అనుమతి లేదని తెలిపింది. అలాగే భారత్‌లోని అమెజాన్‌ కార్యాలయాలకు హాజరుకావద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది.

హెచ్‌-1బీ వీసా రీ-ఎంట్రీ ప్రక్రియలో జాప్యం అమెజాన్‌కే పరిమితం కాదు. గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి ఇతర టెక్‌ దిగ్గజాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీసా ప్రక్రియ పూర్తవ్వడానికి నెలల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే గూగుల్‌ ఇటీవల తన ఉద్యోగులకు అమెరికా విడిచి బయటకు వెళ్లొద్దని సూచించిన విషయం తెలిసిందే. మారుతున్న ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు, అపాయింట్‌మెంట్‌ జాప్యాలు గ్లోబల్‌ టెక్‌ కంపెనీలకు కొత్త సవాళ్లుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులకు తాత్కాలికంగా అయినా వెసులుబాటు కల్పించడం సంస్థలకు అవసరంగా మారింది.

 

 

 

 

  Last Updated: 01 Jan 2026, 07:56 PM IST